Site icon HashtagU Telugu

Patanjali : బాబా రాందేవ్‌కి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

Cbn Ramdev

Cbn Ramdev

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం గట్టి సంకల్పం తీసుకుంది. ఈ దిశగా విజయవాడలో రెండ్రోజుల పాటు నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ (Ramdev Baba) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నామని, బాబా రాందేవ్‌ను రాష్ట్ర పర్యాటక శాఖకు సలహాదారుగా వ్యవహరించమని ఆహ్వానించినట్లు తెలిపారు. బాబా రాందేవ్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారని సీఎం వెల్లడించారు.

Wife Kills Husband : “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” – వీహెచ్

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించిన విధంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోనూ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బాబా రాందేవ్ ఆధ్వర్యంలో పతాంజలి సంస్థ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో గిన్నిస్ రికార్డు సాధించామని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

పర్యాటకంతో పాటు పరిశ్రమల అభివృద్ధికీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా కాగ్నిజెంట్ విశాఖలో కొత్త శాఖను ఏర్పాటు చేయగా, పతాంజలి సంస్థ కూడా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని చినరావుపల్లిలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఆయుర్వేద పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ఇది వందల కోట్ల పెట్టుబడి ప్రాజెక్టు కాగా, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ప్రభుత్వ సేవలను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 15 నాటికి అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.