Site icon HashtagU Telugu

AP Debits: ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్కలు తేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు

Ap Debits

Ap Debits

గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. “సంపద సృష్టించే కార్యక్రమాలను తీసుకురాలేకపోయారు, పెట్టుబడిదారులు వచ్చిన వారిని తరిమేశారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై మాట్లాడుతూ, అప్పులపరమైన వివరణలు ఇచ్చారు. “గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పుల బాధ మరింత పెరిగింది,” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వివరాలు:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న అప్పుల వివరణ ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు: రూ. 9,74,556 కోట్లు

ప్రస్తుతం రాష్ట్రం అప్పుల బారిన పడినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. “ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,74,556 కోట్ల అప్పు తేలింది,” అని ఆయన వెల్లడించారు. అదే సమయంలో, రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “రూ.431 కోట్లతో ఇంత పెద్ద ప్యాలెస్‌ కట్టడం అవసరమా?” అని ప్రశ్నించారు. “రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్‌ కట్టడం సబబేనా?” అని చంద్రబాబు మండిపడ్డారు. అదే సమయంలో, “పర్యావరణాన్ని ధ్వంసం చేసి, రుషికొండలో అలా ఒక భారీ ప్యాలెస్‌ కట్టడం ఎంత వరకు సమంజసంగా ఉంటుంది?” అని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుపెట్టిన వివరాలు వెల్లడిస్తూ, “రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసారని, అంతకుమించి ఓ ప్రముఖ పత్రికకు రూ.400 కోట్లు ఇచ్చి ప్రకటనలు వేపించుకున్నారని” అన్నారు. ” 400 కోట్లు దారద్దత్తం చేసే బదులు ఇంకో 100 కోట్లు కలుపుకుని 500 కోట్లతో రోడ్ల సమస్యను కూడా ప‌రిష్కరించొచ్చు,” అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. “గత ప్రభుత్వం రాష్ట్ర ఆస్తులను అమ్మి, అప్పులు తీసుకుని, ఆర్థిక బలహీనతను సృష్టించింది. మా పాలన వచ్చేసరికి, ఏపీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లు మారింది. అప్పులు భారీగా పెరిగిపోయాయి,” అని ఆయన అన్నారు.

“నా దగర డబ్బులు లేవు, కానీ కొత్త ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలతో రాష్ట్రంలో సంపద సృష్టించి, దానిని పేదలకు పంచుతామని వెల్లడించారు. “దేశంలో ఒక్కో నెలకి రూ.33 వేల కోట్ల పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం మనదే. 64.50 లక్షల మంది ప్రజలకు ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెలవారీ జీతాలు ఒకటో తేదీన ఇస్తున్నాం,” అని చంద్రబాబు చెప్పారు.

మద్యం వ్యాపారాన్ని అనుకూలంగా చూసిన గత ప్రభుత్వంపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మద్యం పైనా ఇంత అవినీతి చేస్తారని ఊహించలేదు. మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. చెత్తపైనా పన్ను వేసి అనేక ఇబ్బందులు పెట్టారు. గత ఐదేళ్లు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎన్నో పనులు చేశారు’ అని చంద్రబాబు విమర్శించారు.