దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియలో కులగణన(Caste Census)ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ఆమోదించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే కొన్నిరాష్ట్రాలు స్వయంగా సర్వేలు నిర్వహించినప్పటికీ, ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోకి వచ్చే అంశం కావడంతో దేశవ్యాప్తంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించనుందని ఆయన తెలిపారు. కరోనా కారణంగా వాయిదా పడిన జనగణన త్వరలో ప్రారంభమవనుందని కేంద్రం స్పష్టం చేసింది.
TG 10th Results : టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్పందించారు. ‘ఈ నిర్ణయం ప్రధానమంత్రి మోదీకి ఉన్న సమ్మిళిత పాలన పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అణగారిన వర్గాలకు అవసరమైన మద్దతును కల్పించేందుకు కచ్చితమైన డేటా లభించడం ఎంతో అవసరం. “సబ్కా సాథ్, సబ్కా వికాస్” లక్ష్యంతో సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతుంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కులగణన ప్రక్రియతో వర్గాల స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, ప్రభుత్వం మెరుగైన విధానాలు రూపొందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో కులగణనతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. మేఘాలయ, అసోం రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రహదారి ప్రాజెక్టులకు రూ. 22,846 కోట్ల మంజూరుతో ఆమోదం లభించింది. అలాగే చెరకు రైతులకు మద్దతుగా క్వింటా చెరకు ధరను అదనంగా రూ.15 పెంచి రూ.355 చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.