Site icon HashtagU Telugu

AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు

CM Chandrababu Naidu orders registration of hereditary lands in secretariats

CM Chandrababu Naidu orders registration of hereditary lands in secretariats

AP : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, వారసత్వంగా సంక్రమించే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో, ఈ ప్రక్రియను గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీయ్యాయి. ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం, భూమి యజమాని మృతి చెందిన అనంతరం, వారసులందరూ ఏకాభిప్రాయంతో రాతపూర్వకంగా అంగీకరించిన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది.

Read Also: Water from Air : ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన మంచినీళ్లు..అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

భూమి వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, మృతుడు యొక్క మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం వంటి వాటిని సమర్పించిన తర్వాత, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్‌కు నామమాత్రపు స్టాంపు డ్యూటీ విధించింది. ఆస్తి మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100, అంతకంటే అధికంగా ఉంటే రూ.1000 మాత్రమే స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రజలకు తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూస్తుంది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే భూ వివరాల మ్యుటేషన్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. భూ రికార్డుల్లో వారసుల వివరాలు నమోదు కావడంతో పాటు, వారికి ఈ-పాస్‌బుక్ కూడా జారీ చేస్తారు. ఈ విధానం వల్ల ప్రజలు తిరుగాడి అవసరం లేకుండా, స్థానికంగా ఉండగానే అవసరమైన సేవలు పొందగలుగుతారు.

ఈ వ్యవస్థ అమలులోకి రావడానికి మరో రెండు లేదా మూడు నెలల సమయం పడే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ సంబంధిత మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం. తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఈ కొత్త విధానం స్థానిక సబ్-రిజిస్ట్రార్ పర్యవేక్షణలో పూర్తిగా పారదర్శకంగా కొనసాగనుంది. అయితే అధికారులు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఈ విధానం కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తులకే వర్తిస్తుందని, ఇతర రకాల రిజిస్ట్రేషన్లు మునుపటిలాగే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరగాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడంతోపాటు అవినీతి, జాప్యాన్ని తగ్గించే దిశగా పెద్ద ముందడుగుగా భావించబడుతోంది. రాబోయే రోజుల్లో ఈ విధానం విజయవంతమైతే, ఇతర రకాల రిజిస్ట్రేషన్లకూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ లో కూకట్‌పల్లికి స్పెషల్ క్రేజ్ ..గజం ఎంతంటే !!