CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో తొలిదశలో పూర్తి చేసిన 11 ఎంఎస్‌ఎఈ పార్కులను ప్రారంభించారు. ప్రభుత్వం ఈ 11 పార్కులను రూ.216 కోట్లతో పూర్తి చేసింది. దీంతో పాటు మరో 39 ఎంఎస్‌ఎంఈ పార్కులను రూ.376 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తయిన పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటితో పాటు రాంబిల్లిలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌నూ(ఎఫ్‌ఎఫ్‌సీ) సీఎం ప్రారంభించారు.
Read Also: Pahalgam Attack : 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఇంకా ఇండియా లోనే ఉన్నారా..?
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. కాగా, మొత్తం 909 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 11 పారిశ్రామిక పార్కుల్లో రోడ్లు, విద్యుత్తు, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 199 కోట్లు ఖర్చు చేసింది. త్వరలోనే మరో 1,455 ఎకరాల్లో అభివృద్ధి చేసే 25 ఎంఎస్‌ఎంఈ పార్కులు, 14 ఎఫ్‌ఎఫ్‌సీలను ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
కాగా, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పెద్దఎత్తున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఇంటికో ఎంట్రపెన్యూర్‌ని తయారు చేసేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పన మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్మికుల పండుగ రోజైన మే డే నాడు కార్మికులకు ఈ కానుక అందించింది. ఆత్మకూరు మండలం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఇక, ఎంఎస్ఎంఈలు రాష్ట్ర అభివృద్ధికి కీలక స్తంభాలు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఎంఎస్ఎంఈలకే ఉంది. అందుకే ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ప్రాధాన్యత ఇస్తోంది.
Read Also: May Day : జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్