CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు వేగంగా సాగుతోంది. దసరా పండుగ రోజున ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ‘వాహన మిత్ర’ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. దసరా రోజున అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ’లో వెల్లడించారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలపై వివరణ
ఈ సభ కేవలం రాజకీయాలు, ఎన్నికలు, ఓట్ల కోసం కాదని, 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. “సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ సభ” అని ఆయన అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గత పాలకులు హేళన చేశారని, ఇప్పుడు వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించామని అన్నారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలపై గతంలో విమర్శలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చంద్రబాబు అన్నారు.
Also Read: France: ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ నిరసనలు.. 200 మంది అరెస్ట్!
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు
ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా 200 మంది తెలుగువారు చిక్కుకుపోయారని, వారిని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను మంత్రి లోకేష్‌కు అప్పగించినట్లు చంద్రబాబు తెలిపారు. లోకేష్ ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ద్వారా ప్రతి క్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
గత పాలనపై విమర్శలు
గత ప్రభుత్వ పాలనను ఉద్దేశిస్తూ ప్రజా వేదికను కూల్చివేతతో మొదలుపెట్టి, అవినీతి, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలు రాకుండా చేశారని, 93 పథకాలను నిలిపివేశారని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు తాము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేశామని చంద్రబాబు అన్నారు.
అన్నదాత సుఖీభవ, దీపం-2 విజయాలు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామని చెప్పామని, మొదటి విడతగా ఇప్పటికే 47 లక్షల మంది రైతులకు రూ. 3,173 కోట్లు జమ చేశామని అన్నారు. రైతన్నలకు యూరియా కొరత రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 1704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని వివరించారు. ఈ పథకాలన్నీ ‘సూపర్ హిట్’ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.