AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా మరో పెద్ద అడుగు వేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి, ఏకకాలంలో రెండు కోట్ల మందికి పైగా పాల్గొనే విధంగా మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్)-2.0 నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించబడుతుండగా, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు తదితరులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. ఇది ఒకే వేదికపై విద్యావ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరినీ చేరదీసే తొలి కార్యక్రమంగా నిలవబోతోంది.
Read Also: Telangana Viral : కోడి కేసు..! తలలు పట్టుకున్న పోలీసులు.. కోడికి న్యాయం కావాలంటూ వృద్ధురాలి పోరాటం
ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో అనేక అంశాలపై ముచ్చటించారు. “మీ భవిష్యత్తులో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు?” అని అడిగి, వారి కలలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యారంగాన్ని మెరుగుపరచడంలో పిల్లల ఆశయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మెగా కార్యక్రమానికి మూలపునాది మాత్రం మంత్రి లోకేశ్ ఆలోచన. ఇప్పటివరకు కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రమే కనిపించే పీటీఎంలను ప్రభుత్వ పాఠశాలల్లోనూ స్థిరంగా ఏర్పాటు చేయాలన్న ఆయన భావనకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి సంబంధించి చేపట్టిన రెండవ అతిపెద్ద చర్య ఇది.
ఈ సమావేశాల ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాసం, ప్రవర్తన, నైపుణ్యాల పురోగతిని ఉపాధ్యాయులతో నేరుగా చర్చించుకునే అవకాశం పొందుతున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు అందిస్తూ, వారి అభిప్రాయాలను స్వీకరించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాలల్లోని మౌలిక వసతులపై, బోధనా విధానంపై కూడా తమ అభిప్రాయాలు, సూచనలను సమర్పించవచ్చు. ఇది కేవలం సమావేశం మాత్రమే కాకుండా, పాఠశాలలను సమాజంతో మమేకం చేసే కార్యక్రమం. విద్యను సామూహిక బాధ్యతగా మలచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని ఏటా ఒక పండుగలా నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ చర్య ద్వారా పాఠశాలలకు మరింత విశ్వాసం చేకూరుతుంది. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు విద్యారంగంలో పారదర్శకతను తీసుకురావడమే కాక, ప్రతి విద్యార్థి ప్రగతిలో ప్రతి ఒక్కరిది పాత్ర ఉందనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రగతిశీల చర్యలు నూతన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన బాసటగా నిలుస్తున్నాయి.
Read Also : Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ