Site icon HashtagU Telugu

Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు

International Tribal Day.. CM Chandrababu, Minister Lokesh wish you well

International Tribal Day.. CM Chandrababu, Minister Lokesh wish you well

Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందేశాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’  ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆదివాసీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నామని, వాటిపై సంబంధిత వర్గాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇచ్చి, వారిని సమగ్ర అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఆదివాసీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన ఆయన, ఆదివాసీ జీవనశైలి అనేది ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి సమీపంలో జీవించే ఆదివాసుల జీవన విధానం, వారి సామాజిక నిర్మాణం, సంప్రదాయాలు అనుకరణీయమని కొనియాడారు. ఆదివాసీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,557 కోట్ల నిధులను గిరిజన సంక్షేమానికి కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. వీటిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల మెరుగుదల, విద్యా-ఆరోగ్య రంగాల్లో నిధుల వినియోగం జరిగిందని వివరించారు. భవిష్యత్‌లో కూడా ఆదివాసీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. సమాజంలో ఆదివాసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ, వారి హక్కులను రక్షిస్తూ, సంస్కృతి పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు, లోకేశ్‌లు స్పష్టంచేశారు. ఈ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సమాజం పట్ల మరింత చైతన్యం కలగాలని, సమానావకాశాలు కల్పించేందుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

Read Also:Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..ఇద్దరు జవాన్ల వీరమరణం