CM Chandrababu & Minister Nara Lokesh Will Going To Maharashtra : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. విమాన ప్రమాదంలో కన్నుమూసిన అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు బయలుదేరనున్నారు. జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు అజిత్ పవార్‌తో దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విపత్కర సమయంలో పవార్ కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ఓదార్చడంతో పాటు, ప్రభుత్వం తరపున సంతాపం తెలియజేయనున్నారు. ఇప్పటికే విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రివర్గ సమావేశంలో సంతాప తీర్మానం
అజిత్ పవార్ మృతిపై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో మంత్రులు ఘన నివాళులు అర్పించారు. సమావేశం ప్రారంభంలోనే మంత్రులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అజిత్ పవార్ ఒక దార్శనికత కలిగిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఉన్న పట్టు అమోఘమని కొనియాడారు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను, పరిపాలనలో ఆయన అనుసరించిన విధానాలను సీఎం గుర్తుచేసుకున్నారు.
Ajit Pawar Plane Learjet 45
జాతీయ నేతల మధ్య బంధం
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు. చంద్రబాబు, లోకేశ్ పర్యటన నిమిత్తం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏపీ అధికారులు ఇప్పటికే సమన్వయం చేసుకున్నారు. అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో భద్రతా ప్రోటోకాల్ మరియు పరామర్శ సమయాలను ఖరారు చేశారు. ఈ విషాద సమయంలో మహారాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని మంత్రులు ప్రకటించారు.
