Site icon HashtagU Telugu

CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్‌కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,717.90 కోట్లను విడుదల చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,35,860 మంది లబ్ధిదారులు రూ.101.16 కోట్ల పింఛను సొమ్మును అందుకోనున్నారు.

కొత్తగా స్పౌజ్ పింఛన్లు

సాధారణంగా ఇంట్లో పింఛను తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాక భార్యకు వితంతు పింఛను తీసుకోవాలంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా వారు ఒకట్రెండు నెలలు పింఛను కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 12వ తేదీన 71 వేల మంది స్పౌజ్ పింఛన్లు అందుకోనున్నారు.

Also Read: Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

3 నెలల పింఛను ఒకేసారి

గత ప్రభుత్వంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండో నెల పింఛను ఇచ్చేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది లబ్ధిదారులకు చాలా ఉపయోగంగా మారింది. ఈ నెలలో 2 నెలల పింఛను కలిపి తీసుకునే లబ్ధిదారులు 1,22,975 మంది ఉండగా, 3 నెలల ఫింఛను కలిపి తీసుకునేవారు 9176 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.111.41 కోట్లను విడుదల చేసింది.

12 నెలలు.. రూ.34 వేల కోట్లు

భారత దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది. రూ.4 వేల నుంచి రూ. 15వేల వరకు ఫించన్ మొత్తాలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఫించన్ నిమిత్తం 12 నెలల్లో రూ.34 వేల కోట్లను వెచ్చించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు ఆర్థిక భరోసానిస్తున్నారు.