CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిని, ఐటీ పరిశ్రమలను బలోపేతం చేయడానికి విస్తృత ప్రణాళికలను ఆవిష్కరించారు. రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి, విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఐటీ కంపెనీలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నూతనంగా రూపొందించిన ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0’పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ రంగాల్లో పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని సూచించారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి రాయలసీమ కేంద్రం
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తిరుపతి సమీపంలోని శ్రీసిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భూమి లభ్యత సమస్యలున్నందున, ఆంధ్రప్రదేశ్‌కు ఇది సానుకూల అంశమని ఆయన పేర్కొన్నారు.
Also Read: Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0’ లక్ష్యాలను అధికారులు వివరించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే ఈ విధానం లక్ష్యం. గత ఏడాది దేశంలో 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీ డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ‘సెల్ఫ్-రిలయన్స్’ (ఆత్మనిర్భరత), ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాలు నెరవేరాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌ను తీర్చగల భారీస్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఏపీలో ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్‌ను సృష్టించడం అనేది కీలకమని ఆయన నొక్కి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రంగంలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఐటీ విస్తరణకు మూడు రీజియన్ల ప్రణాళిక
ఐటీ రంగ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి సారించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన అన్నారు. విశాఖలో ఐటీ/ఐటీఈఎస్ సంస్థలతో పాటు, లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఈ ప్రాంతాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. యువతను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్‌తో ఇతర పోర్టల్స్‌ను కూడా అనుసంధానించాలని ఆదేశించారు. విద్యా రంగంలో కొత్త పాఠ్యాంశాలను జోడించడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు లభించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నాలెడ్జి ఎకానమీలో ఏపీ నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.