ఉచిత ఇసుక (Free sand) అంశంలో ఫిర్యాదులు రావడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో మ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని, వీరిలో కొందరిని ఎంపిక చేసుకుని ఈ శనివారం విడివిడిగా సమావేశం కావాలని ఫిక్స్ అయ్యారు.
ఎక్కడైనా ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక దందా మొదలు పెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే కాకుండా మిత్రపక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇసుక దందా చేస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు ఇసుక దందా చేయకుండా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఎవరైనా వచ్చి వారే ఇసుక తవ్వుకుని తీసుకెళ్తామంటే, ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని తెలిపారు. 3 నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని మంత్రులతో తేల్చి చెప్పారు. కాగా, ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. ట్రాక్టర్ మీద వెళ్లినా, పక్క ఊరు నుంచి ఇసుక తెస్తున్నా ఆంక్షల పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ నిబంధనలు ఎవరు పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Swelling Feet : తరుచుగా పాదాల వాపు.. ఏ వ్యాధికి సంకేతం..!