CM Chandrababu : ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం, కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. ఈ భాగంగా, “దీపం” పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని చంద్రబాబు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది. గ్యాస్ పంపిణీ చేసిన తర్వాత, సీఎం చంద్రబాబు స్వయంగా ఒక లబ్ధిదారుల ఇంట్లో టీ తయారు చేశారు, ఇది వీడియో రూపంలో వైరల్ అయింది. శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో “దీపం – 2.0” కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, శాంతమ్మ అనే లబ్ధిదారురి ఇంట్లో చంద్రబాబు గ్యాస్ స్టౌ వెలిగించి, పాల ప్యాకెట్ కోసి, చాయ్ తయారు చేశారు. “నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు” అని నవ్వుతూ చంద్రబాబు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు , పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం, ఒకటో తేదీ కావడంతో పింఛన్‌దారులకు రూ.4,000 పింఛన్‌ని చంద్రబాబు అందించారు. ఈదుపురంలోని జానకికి సీఎం వెంటనే రూ.4,000 అందజేశారు , ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు అందుబాటులో లేకపోవడంతో, ఆమెకు తక్షణమే ఇల్లు కట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీలలో భాగంగా, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల వ్యవధిలో, లబ్ధిదారులు ఖర్చు చేసిన మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయబడుతుంది.
ఈ సందర్భంగా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న కేబినెట్ లో దీనిపై చర్చించామని, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు. ఆయన మృతితో ఉద్యమం పుడితే తరువాత అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారని, 1956లో ఆంధ్ర రాష్ట్రం , తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు సీఎం చంద్రబాబు. 2014లో జూన్ 2 ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. ఇవన్నీ మొన్న క్యాబినెట్ లో చర్చించామని, ఒక్కో రోజున ఒక్కో పరిణామం జరిగిందన్నారు చంద్రబాబు. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును ప్రత్యేక రోజుగా గుర్తించి నిర్వహించేందుకు మేం నిర్ణయం తీసుకున్నామని, పొట్టి శ్రీరాములు చనిపోయిన డిశంబర్ 15 తేదీ చరిత్రలో ముఖ్యమైన రోజు అని ఆయన అన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసిన రోజును, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆయనను గౌరవించుకుంటామని చంద్రబాబు అన్నారు. ఏపీ విషయంలో చరిత్రలో అనేక మార్పులు జరిగాయని, అయితే చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర సృష్టించిన త్యాగధనులను గౌరవిస్తామన్నారు.ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.