CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారురాలి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్‌ను సీఎం అందజేశారు. అనంతరం గ్రామంలో కలియదిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో నేమకల్లు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. మధ్యాహ్నం బొమ్మనహాల్ మండలం నేమకల్లు చేరుకున్న సీఎం చంద్రబాబునాయుడు మంత్రులు పయ్యావుల కేశవ్, సవితమ్మ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి శ్రీ, గుమ్మనూరు జయరాం, ఎమ్మెస్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు.
కాగా, సెప్టెంబర్ నెల నుంచి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ ను ఆగస్టు 31న ప్రారంభించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు డిసెంబర్ పింఛన్లను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.