Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారుగా కేబినెట్ హోదాలో ఏపీ సర్కారు నియమించిన విషయం తెలిసిందే. ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి. త్వరలోనే ఆయన తన పూర్తిస్థాయి బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ తరుణంలో, కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పుస్తకాల రూపకల్పన:
రాష్ట్ర నైతికత మరియు విలువల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించాలనే నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకుంది. ఈ నిర్ణయం ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకోబడింది. పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ఈ పుస్తకాలను చాగంటితో కలిసి రూపొందించి, వారికి పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
అంతేకాకుండా, కేజీ నుంచి పీజీ దాకా విద్యార్థులకు విలువలతో కూడిన పాఠ్యప్రణాళికను సృష్టించాలనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ పాఠ్యప్రణాళిక అంతరంగంలో, సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద కిట్లు అందించనున్నట్లు ప్రకటించింది.
భారీ వ్యయంతో:
32 కోట్ల 45 లక్షల వ్యయంతో రూపొందించిన కిట్లలో టెక్స్ట్ బుక్స్ తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటీరియల్, రికార్డ్ బుక్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు, రాత పుస్తకాలు కూడా అందించనున్నారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలనే నిర్ణయం కేబినెట్ తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, ఇంటర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, ఈఏపీసెట్ పట్ల ట్రెయినింగ్ ఇవ్వడం కూడా ఈ ప్రణాళికలో ఉంది.
ఈ నేపథ్యంలో, నైతిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు ఈ పదవిని స్వీకరించడం విషయమై ప్రకటన చేసారు. “పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలని ఉద్దేశంతోనే ఈ పదవిని అంగీకరించాను” అని ఆయన చెప్పారు. పదవులు పొందేందుకు తనకు ఆసక్తి లేదని, తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే సరిపోతుందని పేర్కొన్నారు.