Software Cheating : విశాఖ `సాఫ్ట్` మోసం

నిరుద్యోగుల సాఫ్ట్ వేర్ జాబ్ క‌ల‌ను క్యాష్ గా మార్చేసుకున్న విశాఖ‌లోని సైఫ‌ర్ ఫోక్స్ ఐటీ సొల్యూష‌న్స్ బండారం బ‌య‌ట‌ప‌డింది.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 02:00 PM IST

నిరుద్యోగుల సాఫ్ట్ వేర్ జాబ్ క‌ల‌ను క్యాష్ గా మార్చేసుకున్న విశాఖ‌లోని సైఫ‌ర్ ఫోక్స్ ఐటీ సొల్యూష‌న్స్ బండారం బ‌య‌ట‌ప‌డింది. విశాఖ ఐటీ హబ్ హిల్ 2 లో (ciphorfolks) సైఫర్ ఫోక్స్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో విశాఖ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో వలవిసిరారు. పలువురు ఉద్యోగులు లక్షల రూపాయలు వెచ్చించి, ఈ ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 400 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 40 వేలు డబ్బులు వసూలు చేసి మోసానికి ఒడిగట్టారు.

ప్రతినెల సుమారు 20 నుంచి 30 వేల రూపాయల వరకు జీతాలు ఇస్తామంటూ నమ్మబలికి అపాయింట్మెంట్ ఆర్డర్, సెక్యురిటి బాండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది ఆ కంపెనీ. నెలలు గడిచినప్పటికీ జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు చేస్తున్న వారిలో అనుమానం మొదలైంది. దీనిపై పిఆర్వో గా పనిచేస్తున్న ముద్రా సురేష్ తో వాగ్విదానికి దిగారు. అయితే నేను కూడా మీలానే సహ ఉద్యోగినంటూ మాయమాటలు చెప్పి కంపెనీ డైరక్టర్ పూజిత తో చేతులు కలిపి నిరుద్యోగులను నిలువునా ముంచేశారు.

ఇప్పటికే గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటూ కాలం గడపడమే కాకుండా డిపాజిట్ గా కట్టిన 40 వేలు రూపాయలను సైతం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. గట్టిగా మాట్లాడితే మీ సర్టిఫికెట్లు సైతం వెనక్కు ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కంపెనీకి కట్టాల్సి ఉంటుందంటూ బెదిరించ‌డం ఆ కంపెనీ మోసానికి ప‌రాకాష్ట. తాజాగా కంపెనీ తాళాలు వేసి ఉండటంతో ఉద్యోగాలు చేస్తున్న వారు తజ్జనభర్జన పడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారేమోనని భయ ప‌డుతున్నారు.

పిఆర్వో సురేష్ ను సంప్రదించగా మీకు ఏదైనా ఉంటే కనుక డైరక్టర్ పూజిత తో మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల‌ని, లేదంటే జీతాలు ఇచ్చేవరకు నోరు మూసుకొని ఉండాలని హుకుం జారీ చేశారు. జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకుల అండదండలు, మంత్రుల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తీరా డైరక్టర్ ని కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నించగా డైరక్టర్ ఓ మహిళ కావడంతో ఉద్యోగులు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ పోలీస్ కంప్లైట్ ఇస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చేసేదేమీ లేక నిరుద్యోగులు అయోమ‌యంలో ప‌డ్డారు.

ఈ విషయం తెలుసుకున్న మీడియా పి ఆర్ ఓ సురేష్ ని సంప్రదించగా ఈ విషయంలో తలదూర్చితే మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు దిగారు. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఉద్యోగ మేళా లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు భరోసా ఇస్తుంటే ఇటువంటి నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిరుద్యోగులను ముంచుతున్నాయి . ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.