AP Land Pooling Case : అరెస్ట్‌ల ప‌ర్వంలో నెక్ట్స్ పుల్లారావు?

మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అరెస్ట్ మాత్ర‌మే ఇక మిగిలింది. ఆయ‌న చాలా కాలంగా వైసీపీతో లైజ‌నింగ్ గా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ క‌రుణిస్తుంద‌ని వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 02:44 PM IST

మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అరెస్ట్ మాత్ర‌మే ఇక మిగిలింది. ఆయ‌న చాలా కాలంగా వైసీపీతో లైజ‌నింగ్ గా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ క‌రుణిస్తుంద‌ని వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌. వాస్త‌వంగా అగ్రిగోల్డ్‌, హాయ్ ల్యాండ్ సంఘ‌ట‌న‌ల్లో మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు పాత్ర‌పై ఆనాడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆనాడు చేసిన ఆరోప‌ణ‌లు ప‌త్తిపాటి పుల్లారావు మీద ఎక్కువ‌గా ఉన్నాయి. పైగా 2019 ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో జైల్లు పెడ‌తాన‌ని చెప్పిన ఆనాటి మంత్రుల పేర్ల‌లో పుల్లారావుది కూడా ఉంది. కానీ, ఆయ‌న మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోలీసు విచార‌ణ జ‌ర‌గ‌లేదు. మాజీ మంత్రి నారాయ‌ణ కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంతో లైజ‌నింగ్ లో ఉన్నార‌ని టాక్ న‌డిచింది. కానీ, ఆక‌స్మాత్తుగా ఆయన్ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు.

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత వారానికి ఒక‌ర్ని చొప్పున టీడీపీ మాజీ మంత్రుల‌ను అరెస్ట్ చేసిన సంఘ‌ట‌న‌లు చూశాం. మాజీ మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, అచ్చెంనాయుడులను జైలుకు పంపారు . వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల న‌రేంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దితరుల‌ను ఊచ‌లు లెక్కించేలా చేశారు. కానీ, హిట్ లిస్టులో ఉన్న మాజీ మంత్రులు నారాయ‌ణ‌, పుల్లారావు, అయ్య‌న్న‌పాత్రుడు ఇప్ప‌టి వ‌ర‌కు సేఫ్ గా ఉన్నారు. తాజాగా నారాయ‌ణ‌ను అరెస్ట్ చేయ‌డంతో మ‌రోసారి మాజీల అరెస్ట్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. మాజీ మంత్రులు య‌న‌మ‌ల‌, గంటా శ్రీనివాస‌రావుల తో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల‌పై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని త‌వ్వితే, ఆరెస్ట్ కావ‌డం ఖాయ‌మంటూ వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం వెనుక నారాయణ, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నాయ‌ని నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి చిత్తూరులో నారాయణపై కేసు నమోదయింది. ఏ కేసు కింద నారాయణను అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు చెప్పకపోవడం గమనార్హం. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. అంతేకాదు, హైదరాబాదులోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం కూడా ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ రాష్ట్రంలో ఉండ‌కుండా ఎక్కువ‌గా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ లో ఉంటున్నారు. చుట్ట‌పుచూపుగా మాత్ర‌మే ఏపీకి వెళ్లి వ‌స్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా ఏపీ రాష్ట్రంలో నివాసం ఉండ‌డంలేదు. మాజీ మంత్రులు ప‌త్తిపాటి పుల్లారావు, నారాయ‌ణ కూడా ఎక్కువ‌గా హైద‌రాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు నారాయణ అరెస్ట్ త‌రువాత పుల్లారావు హాయ్ ల్యాండ్‌, అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వాటి విచార‌ణ దాదాపుగా చివ‌రికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా త‌దుప‌రి అరెస్ట్ పుల్లారావుదే ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ, ఆయ‌న అనుచ‌రులు మాత్రం వైసీపీతో లైజ‌నింగ్ తో ఉన్నారు కాబ‌ట్టి ఎలాంటి అరెస్ట్ ఉండ‌ద‌ని ఊహిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయ‌మే నారాయ‌ణ మీద కూడా ఉండేది. కానీ, అక‌స్మాత్తుగా ఆయ‌న అరెస్ట్ కావ‌డం మిగిలిన మాజీల‌కు ద‌డ పుట్టిస్తోంది. ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా. ప‌నిచేసిన నారాయ‌ణ అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల్లో కీల‌క పాత్ర పోషించారు. సీఆర్డీయే ఒప్పందాల‌న్నీ ఆయ‌న చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఆయ‌న అరెస్ట్ పేప‌ర్ లీకునా? లేక సీఆర్డీయే ఒప్పందాలా? అనేది చూడాలి.