Site icon HashtagU Telugu

AP Politics : జ‌న‌సేన‌, వైసీపీ మ‌ధ్య `మెగా` చ‌ద‌రంగం

Kodali Pawan Bday

Kodali Pawan Bday

`కొణిద‌ల శివ‌శంక‌ర‌ వ‌ర ప్ర‌సాద్ అలియాస్ చిరంజీవి చుట్టూ `మెగా` రాజ‌కీయం న‌డుస్తోంది. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు జ‌ర‌ప‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ అంటే రాజ‌కీయ వైరం. అంతేకాదు, ప‌వ‌న్ కూడా కొడాలి నాని అంటే ఒంటికాలు మీద విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో చిరంజీవి బ‌ర్త్ డే ను కొడాలి జ‌ర‌ప‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

రెండు రోజులుగా చిరంజీవి సెట్రిక్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ‌వేదిక‌ల‌పై వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జారాజ్యం పార్టీలో ఉంటూ వైసీపీ కోవ‌ర్డులుగా ప‌నిచేసి ముగ్గురు మంత్రులు చిరంజీవికి వెన్నుపోటు పొడిచార‌ని అన్నారు. అంతేకాదు, సీఎం జ‌గ‌న్ ఉద్దేశ‌పూర్వ‌కంగా చిరంజీవి చేతులు క‌ట్టుకునేలా చేసి అహంకారాన్ని సంతృప్తి ప‌రుచుకున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కౌలు రైతుల‌కు భ‌రోసా ఇచ్చేందుకు క‌డ‌ప జిల్లాకు వెళ్లిన ప‌వ‌న్ ఆ వేదిక‌పై నుంచి ఇలాంటి అంశాల‌ను లేవ‌నెత్త‌డం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారితీసింది.

ఇటీవ‌ల మెగా కుటుంబం చీలిపోయింద‌ని టాలీవుడ్ లోని టాక్‌. అందుకే అన్ స్టాప‌బుల్ ప్రోగ్రామ్ హోస్ట్ గా హీరో బాల‌క్రిష్ణ‌ను అల్లు అరవింద్ పెట్టుకున్నార‌ని వినికిడి. అంతేకాదు, త్రిబుల్ ఆర్ సినిమా సంద‌ర్భంగా జూనియ‌ర్, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య సాన్నిహిత్యం న‌డిచింది. మ‌గ‌ధీర త‌రువాత మ‌ళ్లీ మెగా హీరోల‌తో రాజ‌మౌళి సినిమా తీసే ఛాన్స్ లేద‌ని టాలీవుడ్ కోడైకూసింది. కానీ, త్రిబుల్ ఆర్ రావ‌డం వెనుక చాలా క‌థ న‌డించింద‌ని తెలుస్తోంది. ఒక‌ప్పుడు మెగా హీరోలు ఒక‌టిగా ఉండడానికి అల్లు అర‌వింద్ సంధాన‌క‌ర్త‌గా ఉండేవారట‌. ఇప్పుడు అల్లు అర్జున్ భ‌విష్య‌త్ కోసం మిగిలిన వాళ్ల‌ను వ‌దిలేశార‌ని వెండితెర బోగ‌ట్టా. అందుకే, ఇప్పుడు ఎవ‌రిదారి వాళ్ల‌దే అన్న‌ట్టు ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు సినిమా రిలీజ్ ఫంక్ష‌న్లో ప‌వ‌న్ కోసం డిమాండ్ చేస్తున్నార‌ని నాగ‌బాబు ఫ్యాన్స్ మీద ఆగ్ర‌హించారు. ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేనానితో క‌లిసిమెలిసి ఉన్నారు. రాజ‌కీయంగా త‌మ్ముడికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. జ‌న‌సేన‌లో ఉండే వాళ్లే `మెగా` అభిమానులు అంటూ ఇటీవ‌ల ఒక వ్యాఖ్యచేసి ఫ్యాన్స్ ను గంద‌ర‌గోళంలోకి నెట్టారు. ఆ స‌మ‌యంలోనే చిరంజీవి తాడేప‌ల్లి ప్యాలెస్ కు వెళ్లి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. గ‌త ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విందుకు వెళ్లిన చిరు దంప‌తులు జ‌గ‌న్మోహన్ రెడ్డి దంప‌తులు ఇచ్చిన విందుకు సంతృప్తి చెందారు. ఆ విష‌యాన్ని మీడియాకు చిరంజీవి చెప్పిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత సినిమా టిక్కెట్ ధ‌ర‌లు పెంపు, ఆన్ లైన్ విధానం మీద మాట్లాడేందుకు చిరంజీవి అండ్ టీమ్ ను సీఎం ఆహ్వానించారు. ఆ సంద‌ర్భంగా చేతులు జోడించి న‌మ‌స్కారం చేస్తూ టాలీవుడ్ ను కాపాడాల‌ని చిరంజీవి వేడుకున్నారు. ఆ దృశ్యాన్ని ప‌దేప‌దే గుర్తు చేస్తోన్న ప‌వ‌న్ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అహంకారాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇటీవ‌ల భీమ‌వ‌రం వేదిక‌గా జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు చిరంజీవి హాజ‌రు అయ్యారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే బీజేపీ ఆయ‌న మీద వ‌ల‌వేస్తోంద‌ని అర్థం అవుతోంది. ఇంకో వైపు వైసీపీతో క‌లివిడిగా ఉంటోన్న‌ చిరంజీవి మూడు రాజ‌ధానుల‌కు జై కొడుతున్నారు. ఆయ‌న వైసీపీలోకి వెళ్లినా ఆశ్చ‌ర్యంలేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇలాంటి పరిణామాల క్ర‌మంలో చిరంజీవి అండ త‌మ‌కే ఉంటుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం జ‌న‌సేన చేస్తోంది. అందుకే, ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేస్తూ చిరంజీవికి జ‌రిగిన అవ‌మానాలుగా ప‌వ‌న్ చెబుతున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు చెక్ పెట్టేలా చిరంజీవి బ‌ర్త్ డే ను వైసీపీ మాజీ మంత్రి కొడాలి సెలబ్రేట్ చేశారు. మొత్తం మీద ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే, జ‌న‌సేన‌, చిరంజీవి మ‌ధ్య ఏదో అంత‌రం ఉన్న‌ట్టు లీల‌గా అర్థం అవుతోంది. అందుకే, అన్న కోసం చిరు బ్ర‌ద‌ర్స్ ఒక వైపు వైసీపీ మ‌రో వైపు రాజ‌కీయ చద‌రంగాన్ని ఆడుతున్నాయ‌ని భావించాల్సి వ‌స్తోంది.