Site icon HashtagU Telugu

Chiru Meets Jagan : ఆచార్య ‘అమ‌రావ‌తి’ యాత్ర‌

Chirju And Jagan

Chirju And Jagan

మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అమ‌రావ‌తికి ప‌య‌నం అయ్యాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ (CM Jagan) తో లంచ్ మీట్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మేర‌కు అపాయిట్మెంట్ జ‌గ‌న్ ఇచ్చాడు. ప్ర‌త్యేక విమానంలో బేగంపేట నుంచి వెట‌ర‌న్ హీరో చిరంజీవి బ‌య‌లు దేరాడు. టాలీవుడ్, ఏపీ స‌ర్కార్‌కు మ‌ధ్య ఏర్ప‌డిన అగాధాన్ని పూడ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం ఎజెండాగా లంచ్ మీట్ జ‌ర‌గ‌నుంది. ఆ మేర‌కు బ‌య‌ట‌కు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత సినిమా పెద్ద‌లు ఎవ‌రూ ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి తొలి రోజుల్లో వెళ్ల‌లేదు. అదే అంశాన్ని మీడియా ఫోక‌స్ చేసింది. ఒత్తిడికి గురైన టాలీవుడ్ పెద్ద‌లు చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి, దిల్ రాజు, సురేష్ బాబు త‌దిత‌రులు ఆనాడు తాడేప‌ల్లి వెళ్లారు. మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ వాళ్ల మ‌ధ్య తొలుత జ‌రిగింది. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు చిరంజీవి కుటుంబం స‌మేతంగా జ‌గ‌న్ ను క‌లిశాడు. ఆ సంద‌ర్భంగా స్టూడియోల‌కు విశాఖ‌లో భూములు అడిగాడ‌ని బ‌య‌ట‌కు పొక్కింది. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన టాలీవుడ్ బృందంపై హీరో బాల‌క్రిష్ణ ఆనాడు విమ‌ర్శ‌లు గుప్పించాడు. భూముల పంపిణీ కోసం సీఎంల‌ను క‌ల‌వ‌డానికి సిగ్గులేదా? అంటూ ప‌రోక్షంగా మెగా అండ్ టీం మీద ఫైర్ అయ్యాడు.

ఆ రోజు నుంచి టాలీవుడ్ పెద్ద‌లు మౌనంగా ఉన్నారు. అయితే మ‌ర్యాద‌పూర్వ‌కంగా జ‌గ‌న్ ను క‌ల‌వ‌డానికి తొలి భేటీ అయిన చిరంజీవి అండ్ టీం టిక్కెట్ల ఆన్ లైన్, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ఆ విష‌యాన్ని మంత్రి పేర్నినాని మీడియా ఎదుట బ‌హిరంగ‌ప‌రిచిన‌ విష‌యం విదిత‌మే. ఆ మేర‌కు ఏపీ స‌ర్కార్ జీవో 142, 35 విడుద‌ల‌కు నిర్ణ‌యం తీసుకుంది. కానీ, ఆ నిర్ణ‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం తిరుగ‌బ‌డ్డాడు. రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గంపై దాడికి దిగాడు. ఆ రోజు నుంచి టాలీవుడ్‌, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య చిలికిచిలికి గాలీవాన‌లా `బ‌లుపు` వ‌ర‌కు వెళ్లింది.నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్లపురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి సినిమా ప‌రిశ్ర‌మ‌తో అనుబంధం ఉంది. సినిమా వాళ్ల వ్య‌వ‌హారం బాగా తెలిసిన నాయ‌కుడుగా ఉన్న‌ప్ప‌టికీ వాళ్ల‌కు ద‌మ్ము, ధైర్యం ఉండ‌దు..బ‌లుపు ఎక్కువ అంటూ ప‌రోక్షంగా ప‌వ‌న్ ను టార్గెట్ చేశాడు. దీంతో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్, నిర్మాత‌లు ఎన్వీ ప్ర‌సాద్‌, ఆదిత్య తదితులు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై తిర‌గ‌బ‌డ్డారు. సినిమా, రాజ‌కీయ రంగాల మ‌ధ్య మ‌రింత అగాధం `బ‌లుపు` వ్యాఖ్య పెంచేసింది. ఆ రెండు రంగాల్లో ఉన్న సామాజిక వ‌ర్గాల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ప‌ర‌స్ప‌రం దూషించుకుంటున్నారు. రోజుకో ర‌కంగా మ‌లుపు తిరుగుతోన్న ఈ వివాదానికి తెర‌దింపేందుకు చిరంజీవి ప్ర‌త్యేక ఫ్లైట్ ఎక్కాడు.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ శ‌ర్మ రెండు రోజుల క్రితం సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యాడు. కానీ, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లభించ‌లేదు. ఎవ‌రైనా నేరుగా క‌ల‌వాలంటే, అపాయిట్మెంట్ తీసుకుని రావ‌చ్చంటూ బ‌హిరంగ ఆహ్వానం మంత్రి ప‌లికాడు. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ అపాయిట్మెంట్ తీసుకున్న చిరు లంచ్ మీట్ కు ఫిక్స్ అయ్యాడు. కానీ, ఆయ‌నే ప్ర‌తిపాదించిన టిక్కెట్ల ఆన్ లైన్‌, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై జ‌గ‌న్ తో మాట్లాడే ధైర్యం మెగా హీరో చేస్తాడా? అనే అనుమానం ఉంది. ఆయ‌న న‌టించిన ఆచార్య‌, త‌మ్ముడు ప‌వ‌న్ హీరోగా న‌టించిన బీమ్లానాయ‌క్‌, త్రిబుల్ ఆర్‌, ప్ర‌భాస్ సినిమా రాధాశ్యామ్ లాంటి సినిమాల విడుద‌ల వాయిదా ప‌డింది. ఉచితంగా సినిమాను ఆడిస్తానంటూ ప‌వ‌న్ అంటుండ‌గా, చిరంజీవి మాత్రం జ‌గ‌న్ ప్ర‌స‌న్నం కోసం అమ‌రావ‌తి విమానం ఎక్కాడు.ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టు నిర్ణ‌యం మేర‌కు ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ నివేదిక వ‌చ్చిన త‌రువాత మాత్ర‌మే ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ టిక్కెటింగ్ మీద తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. జీవోలు 142, 35 మీద టాలీవుడ్ లోని కొంద‌రు న్యాయం పోరాటం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో చిరంజీవి భేటీ అనంత‌రం జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో..ఆస‌క్తిక‌రం. క‌నీసం కులం, బ‌లుపు లాంటి వ్యాఖ్య‌ల‌కు `ల‌ంచ్ మీట్` ఫుల్ స్టాప్ పెడుతుందేమో..చూద్దాం.!