Chiranjeevi : గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన

చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 02:43 PM IST

గుడివాడ (Gudivada )లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న మంగళవారం చిరంజీవి ఫై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ ..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ..వెంటనే కొడాలి నాని చిరంజీవికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు.

చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం చేయడం తో అభిమానులు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయినవారిలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులు ఉన్నారు. అలాగే నూజివీడు పట్టణ చిన్న గాంధీ బొమ్మ కూడలి లో నూజివీడు చిరంజీవి యువత అధ్యక్షుడు సత్రపు సుధీర్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, బహిరంగంగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలని కోరారు. అనంతరం కొడాలి నాని చిత్రపటాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

అసలు ఏంజరిగిందంటే..చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు (Waltair Veerayya 200 Days) పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఏపీ సర్కార్ కు సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) .. ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందన్నారు. దీనిపై ఇప్పుడు గుడివాడ లో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు రోడ్లపైకి వచ్చి నాని కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.