Site icon HashtagU Telugu

Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!

Chintalapudi Lift Irrigation Project

Chintalapudi Lift Irrigation Project

Chintalapudi Lift Irrigation Project: గోదావరి నదిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పట్టాలెక్కించేందుకు చర్యలు చేపడుతున్నారు. జల్లేరు వాగు జలాశయం నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నందున, అటవీ భూముల సేకరణ సమస్యలను పక్కన పెట్టి మిగతా పనులను ప్రారంభించనున్నట్లు జలవనరుల శాఖ నిర్ణయించింది. మొదటగా, గోదావరి జలాలను ఎత్తిపోసి, కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీల ద్వారా కొంత ఆయకట్టుకు నీరు అందించే యోచనతో పని పునఃప్రారంభమవుతోంది.

ఈ ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు రూ.4,122.85 కోట్లు వెచ్చించినా, రైతులకు ఎలాంటి ప్రయోజనం అందలేదు. నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ అంచనా వ్యయం పెరిగి రూ.9,547 కోట్లకు చేరింది. ఇంకా రూ.4,465 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం, 90 రోజుల పాటు 53.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, కాలువల ద్వారా తరలించేందుకు ప్రతిపాదించబడింది. ఈ పథకం సాకారమైతే, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్తగా 2 లక్షల ఎకరాల సాగు ప్రారంభమవుతుంది. తద్వారా 28 లక్షల జనాభాకు తాగునీటి భరోసా కూడా అందించబడుతుంది.

2026 జూన్‌కు ప్రాజెక్టు పూర్తి:

గోదావరి నదిపై పోలవరం దిగువన చేపట్టిన పంప్‌హౌస్‌ పనులు 78 శాతం, పైపులైన్‌ పనులు 81 శాతం పూర్తయ్యాయి. మొత్తం 7.55 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయాల్సి ఉంది. లీడింగ్‌ ఛానల్‌ 13.22 కి.మీ., ప్రధాన కాలువ 106.250 కి.మీ. మేర తవ్వాల్సి ఉంది, ప్రస్తుతం ఇది సగం వరకు పూర్తయ్యింది. ఈ కాలువలపై 318 కట్టడాలు, వంతెనలు, అక్విడక్టులు, సైఫన్లు, సూపర్‌ పాసేజ్‌లు, రెగ్యులేటర్లు, ఇన్‌లెట్లు, అవుట్‌లెట్లు నిర్మించాల్సి ఉంది. కొన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయి, కానీ 218 కట్టడాల నిర్మాణం ఇంకా మొదలుకాలేదు.

ఈ మొత్తం పనులను దశల వారీగా చేపట్టి 2026 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని జలవనరుల శాఖ లక్ష్యం పెట్టుకుంది. కొన్ని ప్యాకేజీలలో ఇద్దరు గుత్తేదారులు కలిసి టెండర్లు దక్కించుకున్నప్పటికీ, ఒక గుత్తేదారు సంస్థ లిక్విడేట్ కావడంతో, సర్కార్‌ మొత్తం పనులను మేఘాకు అప్పగించాలని ఆమోదం తెలిపింది.

భూసేకరణలో సమస్యలు అధిగమిస్తేనే:

జల్లేరు జలాశయం కోసం 2,715 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది, అందుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కాలువల తవ్వకం కోసం రైతుల నుండి భూసేకరణ ప్రయత్నాలు కొనసాగిస్తూ, ఇతర నిర్మాణ పనులను కూడా జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూసేకరణపై రైతులు హైకోర్టులో వేసిన కేసులను సులభంగా పరిష్కరించేందుకు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

జల్లేరు జలాశయం మినహా మిగిలిన పనులు పూర్తిచేస్తే, తొలుత 2.10 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది, దీనివల్ల కొత్తగా 50 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. 14 లక్షల జనాభాకు తాగునీటి వసతి అందించేందుకు కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ పనులకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే వచ్చే 4 నెలల్లో రూ.426 కోట్లు అవసరమని జలవనరుల శాఖ ప్రతిపాదించింది.