Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు

Chicken Prices :  చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.

  • Written By:
  • Updated On - February 28, 2024 / 09:51 AM IST

Chicken Prices :  చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది. గత నెలలో కిలో చికెన్ ధర రూ.180 పలికింది. ఇప్పుడది ఏకంగా రూ.300కు చేరడంతో చికెన్ ప్రియులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.300, స్కిన్‌తో రూ.260 వరకు అమ్ముతున్నారు. బోన్ లెస్ చికెన్ ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కుపైనే ఉంది.ఏటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు.. ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం కావడంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. ఏపీలో ఎండల ధాటికి కోళ్లు చనిపోతుండడంతో అక్కడి వ్యాపారులు హైదరాబాద్‌, శంషాబాద్‌, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ  ఫారాల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో కోళ్ల కొరత ఏర్పడుతోంది. ఇక ఏపీలో కోడి గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా.. ఒక్కో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10 వరకు స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.180 నుంచి రూ.200, లైవ్‌ కోడి ధర రూ.120 నుంచి రూ.160 దాకా పలికింది. ఇటీవల పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతి భారీగా తగ్గింది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా చికెన్‌కు డిమాండ్‌ పెరగడంతో ధరలు(Chicken Prices) కూడా  పెరిగిపోయాయి. కిలో లైవ్‌ కోడి ధర కూడా రూ.180 వరకు పలుకుతుండడంతో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. నాటుకోడి ధర రూ.380 నుంచి రూ.450 ఉండడంతో చాలామంది దానిఊసే ఎత్తడం లేదు.

Also Read : National Science Day : రూ.200 విలువచేసే పరికరాలతో ‘నోబెల్’.. హ్యాట్సాఫ్ సీవీ రామన్

ధరలు భారీగా పెరగడంతో హైదరాబాద్‌లో చికెన్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజులతో పోలిస్తే నాలుగు రోజులుగా 40 శాతం సేల్స్ పడిపోయాయి. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో సగటున 12 వేల టన్నుల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరల కారణంగా ఆదివారం రోజు హైదరాబాద్‌ నగరంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో కలిపి 6వేల టన్నుల వరకే చికెన్ సేల్స్ జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ సుమారు 10వేల టన్నుల చికెన్‌ను విక్రయిస్తుంటారని అంచనా. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్‌ పండుగల సమయంలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు అమ్ముతుంటారు. హైదరాబాద్‌లోని చాలా చికెన్‌ సెంటర్లలో ప్రస్తుతం జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటివారంలో కొనుగోలు చేసిన కోడి పిల్లలే ఉన్నాయి. డిమాండ్‌ ఉన్నందున వాటికే రేట్లు పెంచి అమ్ముతున్నారు.

Also Read : CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రకటన