Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా రామోజీరావు (Ramoji Rao Biography) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
రామోజీరావు ప్రస్థానం ఇదే
చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
కృష్ణా జిల్లాలో జననం, అసలు పేరు రామయ్య
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.
బాల్యం, విద్యాభ్యాసం, వివాహం
ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటు రామోజీరావుకి ఉండేది. రామయ్య అనే తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.
Also Read: Modi Oath Ceremony: ప్రధాని మోదీ కోసం విదేశీ నేతలు.. భారత్ రానున్న ప్రముఖులు వీరే..!
1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా వ్యవహారించారు.
ఉద్యోగం, వ్యాపారాల ఆరంభం
రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.
We’re now on WhatsApp : Click to Join
రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967-1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకునేది.
డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు ప్రారంభం
విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు. అంతేకాకుండా ఆగస్టు 10, 1974లో ఈనాడును స్థాపించారు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.
ఒడిదుడుకులు
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనే ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని బయటపడింది. రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావును విచారించింది.