Cheddi Gang : స‌వాల్ గా మారిన చెడ్డీ గ్యాంగ్‌.రంగంలోకి దిగిన కొత్త సీపీ..?!

ఏపీలో చెడ్డీ గ్యాంగ్ అల‌జ‌డి ప్ర‌జ‌ల‌కు, పోలీసుల‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా ప‌లు చోట్ల దోపిడీల‌కు పాల్ప‌డింది.

  • Written By:
  • Publish Date - December 11, 2021 / 11:06 AM IST

ఏపీలో చెడ్డీ గ్యాంగ్ అల‌జ‌డి ప్ర‌జ‌ల‌కు, పోలీసుల‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా ప‌లు చోట్ల దోపిడీల‌కు పాల్ప‌డింది. ముఖ్యంగా విల్లా, అపార్ట్స్ మెంట్ ల‌ను ఈ గ్యాంగ్ టార్గెట్ గా పెట్టుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు నివ‌సిస్తున్న రెయిన్ బో విల్లాలో ఈ ముఠా దోపిడికి పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వ‌చ్చిన‌ట్లు వ‌చ్చి ఈ గ్యాంగ్ దోపిడీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే ఐదు చోట్ల దొంగ‌త‌నాల‌కు చెడ్డీ గ్యాంగ్ పాల్పడింది. దీంతో ఈ ప్రాంతంలో ప్ర‌జ‌లు రాత్రి నిద్ర‌పోవాలంటే హ‌డ‌లిపోతున్నారు. వ‌సంత‌న‌గ‌ర్‌, చిట్టిన‌గ‌ర్‌, గుంటుప‌ల్లి,తాడేప‌ల్లి,కుంచ‌న‌ప‌ల్లి ప్రాంతాల్లోని అపార్ట్స్ మెంట్స్‌, విల్లాల‌లో ప‌లు దొంగ‌తనాలు వెలుగులోకి వ‌చ్చాయి.

రెండు వేర్వేరు ముఠాలు దోపిడీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ముఠాల దోపిడీ చేసే తీరు, అక్క‌డ ల‌భించిన ఆధారాల ప్ర‌కారం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ని ప‌ట్టుకునేందుకు విజ‌య‌వాడ నూత‌న పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా నేరుగా రంగంలోకి దిగారు. రైల్వే స్టేష‌న్ ల‌లో త‌నిఖీలు చేశారు. ప‌లు అపార్ట్మెంట్ ల నివ‌సిస్తున్న వారిని క‌లిసి ప‌లు సూచ‌న‌లు ఆయ‌న చేశారు.గుజ‌రాత్ ముఠా గా భావిస్తున్నామ‌ని..ఇప్ప‌టికే ఆ రాష్ట్ర పోలీసులను సంప్ర‌దించిన‌ట్లు విజ‌య‌వాడ సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. గ్యాంగ్ లో ఐదు నుంచి ఏడుగురు స‌భ్యులు ఉంటార‌ని…ముఠా స‌భ్యులు షార్ట్స్ ధ‌రిస్తార‌ని ఆయ‌న తెలిపారు.వీళ్ల టార్గెట్ అంతా ఎక్కువ‌గా తాళం వేసిన ఇళ్ల‌పైనే ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఈ చెడ్డీ గ్యాంగ్ ఒక రాష్ట్రంలో వ‌రుస దోపిడీలు చేసి వేరే రాష్ట్రానికి పారిపోతార‌ని…ముఠా స‌భ్యులు 25 నుంచి 40 సంవ‌త్సరాల వ‌య‌సుగ‌ల వారని పోలీసులు తెలిపారు. వీరంత రోడ్ల ప‌క్క‌న‌, చిన్న హోట‌ళ్ల‌లో, రైల్వే స్టేష‌న్ లో ఉంటార‌ని పోలీసులు అంటున్నారు. చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు జ‌రిపిన ప్రాంతాల్లో ఒక చోట సేక‌రించిన వేలిముద్ర‌లో మ‌రోచోట సేక‌రించిన వేలిముద్ర‌లు వేరువేరుగా ఉన్నాయ‌ని…ప‌లు ముఠాలుగా ఏర్ప‌డి దోపిడీలు చేస్తున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.చెడ్డీ గ్యాంగ్ తాళాలు పగులగొట్టేందుకు ఇనుప రాడ్ల‌ను వెంట‌ తీసుకువెళుతున్నార‌ని… దోపిడీకి పాల్పడిన తర్వాత సులువుగా తప్పించుకునే మార్గాలపై వారు దృష్టి సారిస్తున్నార‌ని సీపీ తెలిపారు. చడ్డీ ముఠాలు సాధారణంగా నగదు, బంగారు ఆభరణాలను మాత్రమే దోచుకుంటాయ‌ని తెలిపారు.

చడ్డీ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.
దహోద్ పోలీసు సూపరింటెండెంట్‌తో విజ‌య‌వాడ సీపీ కాంతిరాణా టాటా మాట్లాడారు. గుజ‌రాత్ నుండి రెండు ముఠాలు తప్పిపోయాయని అక్క‌డి ఎస్పీ తెలిపార‌ని సీపీ చెప్పారు. అదే గ్యాంగ్ ఏపీలో దోపిడీలు చేస్తున్నాయ‌ని తాము అనుమానిస్తున్నామ‌ని సీపీ వివ‌రించారు.