Site icon HashtagU Telugu

Chebrolu Kiran: చేబ్రోలు కిరణ్ కు 14 రోజుల‌ రిమాండ్.. వారికి చంద్ర‌బాబు వార్నింగ్‌

Chebrolu Kiran Arrest

Chebrolu Kiran Arrest

Chebrolu Kiran: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్‌కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. కిర‌ణ్ వ్యాఖ్య‌ల‌పై మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్‌ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Tirumala: తిరుమ‌ల గోశాల‌లో గోవులు మ‌ర‌ణించాయా..? వైసీపీ ఆరోప‌ణ‌లకు స్ట్రాంగ్ రియాక్ష‌న్

శుక్ర‌వారం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో చేబ్రోలు కిర‌ణ్ కుమార్‌కు ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకి తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు కిరణ్‌కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మంగళగిరి రూర‌ల్‌ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.

 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి మ‌హిళ‌ల‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. తాజా.. టీడీపీ కార్య‌క‌ర్త కిర‌ణ్ ను అరెస్టు చేయ‌డం ద్వారా.. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది.

 

మ‌రోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియా దుర్వినియోగం చేసే వారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శిస్తే అది నేరంగా పరిగణిస్తామన్నారు. తప్పు చేసే వారిపై చండశాసనుడిగా వ్యవహరిస్తానని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. వైఎస్‌ భారతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా నేరస్థుల వేదికగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్ర‌బాబు.. మహిళలకు గౌరవప్రదమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.