Site icon HashtagU Telugu

AP Politics : ఏపీ `డ‌ర్టీ` పాలి`ట్రిక్స్`

Ap Posters

Ap Posters

ఏపీ రాజ‌కీయం ఛండాలంగా మారింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని మ‌హిళ‌ల్ని బ‌జారు కీడ్చే `డ‌ర్టీ` పాలిటిక్స్ కు వేదిక‌గా మారింది. గాసిప్స్, వ్య‌క్తిత్వ హ‌న‌నం, నిరాధార ఆరోప‌ణ‌లు, అశ్లీల పోస్ట‌ర్ల‌తో ఏపీ రాజ‌కీయం నిండిపోయింది. ఒక‌ప్పుడు స‌గ‌ర్వంగా పిలుచుకునే అన్న‌పూర్ణ‌లాంటి ఏపీ ప‌రువు కృష్ణా, గోదాట్లో క‌లిసిపోతోంది. ఎనిమిదేళ్ల క్రితం జ‌నసేన సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రారంభ‌మైన బూతు, అశ్లీల సాహిత్యం 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీ, టీడీపీ ప‌తాక‌స్థాయికి చేర్చాయి. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ మ‌ధ్య న‌డుస్తోన్న రాజ‌కీయ యుద్ధం ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పే, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి పే అంటూ పోస్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు దిగ‌జారింది.

ఏపీ, తెలంగాణాల్లోని ప్ర‌ధాన మీడియా `పింక్, ఎల్లో, బ్లూ, బ్లాక్` విభాగాలుగా మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న మీడియాకు పింక్, వైసీపీ సొంత మీడియాకు బ్లూ, టీడీపీ సానుభూతి మీడియాకు ఎల్లో, సమాజాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ పీక్కుతినే మీడియాకు చీక‌టి( బ్లాక్‌) మీడియాగా ప్రాచుర్యం ఉంది. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఆధిపత్యం తెలుగు రాష్ట్రాల్లో బాగా క‌నిపిస్తోంది. అందుకే, సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను ఆయా రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి. వాటి నిర్వాహ‌కులుగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను పెట్టుకుంటున్నారు. దీంతో ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు బ‌దులుగా ప్రైవేటు వ్య‌వ‌హారాలు, ఇళ్ల‌లోని మ‌హిళ‌ల్ని టార్గెట్ చేసి న్యూస్ ను వండివార్చుతున్నారు. గౌర‌వంగా ఇళ్ల‌లో ఉండే మ‌హిళ‌లపై పోస్టుల‌ను క్రియేట్ చేస్తూ వాళ్ల భ‌ర్త‌ల్ని బ‌జారుకీడ్చ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లోని స‌రికొత్త ట్రెండ్ గా క‌నిపిస్తోంది.

ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియాను దాటుకుని ఇప్పుడు పోస్టర్ల వ‌ర‌కు బూతు, అశ్లీల రాజ‌కీయం చేరింది. గోడ‌లు, హోర్డింగ్ లపై పోస్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌త్య‌ర్థి పార్టీల అధిప‌తుల‌ను మానసిక ఆందోళ‌న‌కు గురిచేసే రాజ‌కీయం వ‌చ్చేసింది. రెండు రోజులుగా వైఎస్ భార‌తి, నారా బ్ర‌హ్మ‌ణి ఫోటోల‌తో ఉన్న పోస్ట‌ర్లు ఏపీలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో భార‌తి ఉన్నార‌ని తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మేర‌కు ఆ పార్టీ సానుభూతి మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా డామేజ్ చేస్తూ ప్ర‌చారం చేసింది. తాజాగా `భార‌తి పే` లిక్క‌ర్ మ‌నీ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ టైటిల్ తో ఒక క్యూ ఆర్ కోడ్ ను చిత్రీక‌రించి గోడ‌ల‌పై ప్ర‌ద‌ర్శించిన‌ పోస్ట‌ర్ ఏపీలో క‌ల‌క‌లం సృష్టించింది. ప్ర‌తిగా బ్ర‌హ్మ‌ణి పే- తాజ్ హోట‌ల్ బిల్స్ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ ఒక క్యూ ఆర్ కోడ్ బ్ర‌హ్మ‌ణి ఫోటోతో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ నాలుగు పెళ్లిళ్లు వ్య‌వ‌హారంతో ప్రారంభ‌మై శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ జ‌న‌సేన యుద్ధం అప్ప‌ట్లో న‌డిచింది. ఆ స‌మ‌యంలో అశ్లీల ప‌ద‌జాలం విస్తృతంగా న‌డిచింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేసిన అంశాన్ని అప్ప‌ట్లో చూశాం. అదే ఒర‌వ‌డిని జన‌సేన కొన‌సాగిస్తోంది. ఆ పార్టీని త‌ల‌ద‌న్నే విధంగా 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ ప‌ర‌స్ప‌రం గాసిప్స్ తో హోరెత్తించాయి. ప్ర‌భాస్-ష‌ర్మిల‌, కోటి- లక్ష్మీపార్వ‌తి, రాహుల్‌-బ్ర‌హ్మ‌ణి ఇలా ఎన్నో అంశాల‌ను సోష‌ల్ మీడియా కూడా సిగ్గుప‌డేలా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి ఏ మాత్రం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు సంబంధంలేని భార‌తి, బ్ర‌హ్మ‌ణి పోస్ట‌ర్ల‌ను అశ్లీలంగా ప్ర‌ద‌ర్శిస్తూ వైసీపీ, టీడీపీ `సోష‌ల్ యోధులు` ప‌ర‌స్పరం ఏపీ ప‌రువును బ‌జారుకీడ్చేశారు.