Sri Kanipakam Varasiddhi Vinayaka Laddu కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఆలయ పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. ఈ మార్పులతో లడ్డూ రుచి, నాణ్యత పెరిగిందని.. భక్తులుకు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు.
- తిరుమల తరహాలో కాణిపాకం గణేషుడి లడ్డూలు
- విజయవాడ నుంచి నిపుణులను పిలిపించి ప్రయోగం
- లడ్డూ రుచి, నాణ్యతలో మార్పులు.. భక్తుల ప్రశంసలు
దేవుడికి నైవేద్యంగా అనేక ఆహార పదార్థాలను సమర్పిస్తారనే విషయం తెలిసిందే. అందులో లడ్డూ అత్యంత విశిష్టమైనది. హిందూ సంప్రదాయంలో ఏ పని చేసినా.. ముందుగా గణపతిని ఆరాధిస్తాం. విఘ్నాలు తొలగించే ఆ గణేషుడికి ‘మోదకం’ లేదా ‘లడ్డు’ అంటే అమితమైన ఇష్టం. ఈ లడ్డూ కేవలం తీపి పదార్థమే కాకుండా.. జ్ఞానం, ఆనందం, సంపూర్ణత్వానికి చిహ్నంగా భావిస్తారని పండితులు చెబుతున్నారు. అలాంటి లడ్డూ ప్రసాదంగా తీసుకుంటే.. భక్తులకు కూడా ఆ అనుభూతి కలగాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కాణిపాకం వినాయకుడి లడ్డూ ప్రసాదంపై చాలా వరకు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆలయ నిర్వాహకులు.. ఆదివారం (డిసెంబర్ 4) చేసిన ప్రయోగం విజయవంతం అయింది.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఆలయ నిర్వాహకులు పలు మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న లడ్డూ ప్రసాదంపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది ఆలయ పాలకమండలి. అందులో భాగంగా.. రుచికరమైన, నాణ్యమైన లడ్డూలను భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించారు. కాగా, తిరుమల లడ్డూ తర్వాత.. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు ఎక్కువ ఇష్టంగా తింటారు. దీంతో విజయవాడ ఆలయంలో ప్రసాదాలు తయారుచేసే వారిని కాణిపాకానికి పిలిపించారు.
ప్రయోగం సక్సెస్..
అనంతరం కాణిపాకంలో డిసెంబర్ 4న ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. అక్కడ ఎలా తయారు చేస్తారో.. అదే విధంగా కాణిపాకంలో ప్రసాదాన్ని తయారుచేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు ఆలయ పాలక మండలి తెలిపింది. లడ్డూ ప్రసాదం రుచిలో భారీగా మార్పులు వచ్చినట్లు పేర్కొంది. భక్తుల నుంచి కూడా గణేషుడి ప్రసాదానికి మంచి స్పందన వచ్చిందని వెల్లడించింది.
కొత్త తరహా విధానం ద్వారా రుచి, నాణ్యత పెరిగినందున.. కాణిపాకంలో లడ్డూ తయారీలో సమూలంగా మార్పులు చేయాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్న పోటు తరహాలో.. కాణిపాకంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేశారు.
మరోవైపు, కాణిపాకంలో లడ్డూ తయారీకి వినియోగించే స్టవ్‌లు, పాత్రలను కూడా మార్చనున్నట్లు ఆలయ పాలకమండలి సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం భక్తులకు అందించే లడ్డూ రెండు రోజుల్లోనే గట్టిగా అయిపోతోంది. ఈ సమస్యలను అధిగమించి కనీసం ఐదురోజుల వరకు లడ్డూ నాణ్యంగా, రుచిగా ఉండేలా తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దాదాపు నెల రోజుల్లో భక్తులకు తిరుమల తరహా రుచికరమైన, నాణ్యమైన లడ్డూ అందించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ పేర్కొన్నారు.
