Chandrababu Naidu:కానిస్టేబుల్ ప్ర‌కాష్ ఉద్యోగానికి ఎస‌రు, ఖండిస్తూ చంద్ర‌బాబు ట్వీట్

స‌రెండ‌ర్ లీవులు, అద‌న‌పు సరెండ‌ర్ లీవుల‌కు సంబంధించిన బిల్లుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులు ప‌ట్టుకుని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి నిర‌స‌న తెలిపిన ఏ ఆర్ కానిస్టేబుల్ ప్ర‌కాష్ పై ఏపీ పోలీసులు కేసులు పెట్టారు.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 04:31 PM IST

స‌రెండ‌ర్ లీవులు, అద‌న‌పు సరెండ‌ర్ లీవుల‌కు సంబంధించిన బిల్లుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులు ప‌ట్టుకుని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి నిర‌స‌న తెలిపిన ఏ ఆర్ కానిస్టేబుల్ ప్ర‌కాష్ పై ఏపీ పోలీసులు కేసులు పెట్టారు. గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ప్రకాశ్ `సేవ్ ఏపీ పోలీస్` అంటూ ప్లకార్డుతో నిరసన చేశారు. ఆ సంఘ‌ట‌న‌ను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు పాత కేసులు తిరగదోడారు.
అనంత‌పురం జిల్లా గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించడంతోపాటు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసిన ఆరోపణలపై 2019 జులైలో గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ ‌పై కేసు నమోదైంది. కానిస్టేబుల్ నిరసన ప్రదర్శన తర్వాత జూన్ 17న ఈ కేసులో శాఖాపరమైన విచారణ నిర్వహించిన అధికారులు అభియోగం రుజువైందంటూ నోటీసు ఇచ్చారు. అలాగే, 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ ఈ నెల అదే నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ కేసులోనూ అతడిపై నమోదైన అభియోగాలపై చర్యలకు ఉన్న‌తాధికారులు సిఫార్సు చేశారు. ప్రకాశ్ బ్యాంకు లావాదేవీలతోపాటు అతడి కదలికలపైనా స్పెషల్ బ్రాంచి పోలీసులు నిఘా పెట్ట‌డంతో ప‌లు కేసుల‌ను పెట్టారు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించ‌డానికి రంగం సిద్ధం అయింది. దీనిపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు.

ఏఆర్ కానిస్టేబుల్ గా ప‌నిచేస్తోన్న ప్ర‌కాష్ కు ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన బ‌కాయ‌లు ఇవ్వ‌క‌పోగా, కేసులు పెట్ట‌డం ఏమిటిని ఆయ‌న ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌శ్నించిన పాపానికి పోలీసు మీద కేసులు బ‌నాయించారంటే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌ని నిల‌దీశారు. కానిస్టేబుల్ ప్ర‌కాష్ ను ఉద్యోగం నుంచి తొలగించే ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. సంఘ‌ట‌న‌ను ఖండిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.