ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు నిర్ణయించారు. శాసనసభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రముఖ ఉద్యమకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రపోజల్‌ను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పెట్టగా, శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇక, అల్లూరి సీతారామరాజు స్మారకార్థం ఒక మ్యూజియం కూడా విమానాశ్రయం పక్కన ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్లమెంటులో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టాలని భావించామని.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో పెడతామని.. అవసరమైతే తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం పోరాడి, ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారన్నారు సీఎం చంద్రబాబు. రాజవొమ్మంగి, చింతగొంది, కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్లపై దాడి చేసి, బ్రిటిష్ హకిములకు భయాన్ని పుట్టించారు అని ఆయన వివరించారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం గుర్తు చేస్తూ, దేశం కోసం చేసిన వీర పోరాటాలను స్మరించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా, అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని వెల్లడించారు. అలాగే, అల్లూరి సీతారామరాజు స్మారకంగా భోగాపురం ఎయిర్‌పోర్టులో స్మారక మ్యూజియాన్ని నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో లోకాయుక్త సవరణ బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్లు, మున్సిపల్ లా బిల్లు, వస్తు, సేవల సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, మరియు మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు.
అలాగే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతానని సంబంధిత తీర్మానాలను కూడా సభ ఆమోదించింది.