Chandrababu : డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌.. ప‌ట్టాభి, దొంతు చిన్నాల భ‌ద్ర‌త‌కు చ‌ర్య‌లు తీసుకోండి

గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 07:13 AM IST

గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి ల భద్రత కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ గుండాల‌కు పోలీసులు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడులుచేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసి అద్దాలను పగులగొట్టార‌ని తెలిపారు. అంత విధ్వంసం జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు రౌడీమూకను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషించారని లేఖ‌లో చంద్ర‌బాబు పేర్కొన్నారు.

దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారని.. బీసీ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేశారని తెలిపారు. చిన్నా, అతని కుటుంబ సభ్యులను ఫోన్లు చేస్తూ బెదిరించారని.. చిన్నాకు చెందిన వాహనాలు, రెండు బైక్‌లకు నిప్పు పెట్టారని చంద్ర‌బాబు లేఖ‌లో ప్ర‌స్తావించారు. బీసీ నాయకుడు దొంతు చిన్నా ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. పట్టాభి డ్రైవర్, అతని భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారి ఫోన్ లు ఆఫ్ చేశారు. అప్పటి నుండి పట్టాభి ఆచూకీ తెలియలేదన్నారు.

పట్టాభిని నిజంగా పోలీసులు అరెస్టు చేశారా…లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? పట్టాభిపై గతంలో కూడా వైసీపీ నేతలు వివిధ సందర్భాల్లో దాడి చేశారని.. అతని ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో అతని భద్రత పోలీసుల బాధ్యతని చంద్ర‌బాబు తెలిపారు. పట్టాభి భార్య తన భర్త భద్రత గురించి ఆందోళన చెందుతోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితుల పై మీరు కేసులు పెడతారా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మీ నాయకత్వంలోని పోలీసు విభాగం ఇలా ప్రవర్తిస్తుంది. ఇది బాధితులను మరింత బలిపశువులను చెయ్యడమేన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం దోషులను అరెస్టు చేయడం తో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.