Chandrababu Naidu : ఆదివాసీ గిరిజ‌నుల‌కు అండ‌గా చంద్ర‌బాబు

బాక్సైట్ దోపిడీ కోసం ప్రభుత్వం అడవులను నరికి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పాల్పడుతోందని డీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 04:44 PM IST

బాక్సైట్ దోపిడీ కోసం ప్రభుత్వం అడవులను నరికి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పాల్పడుతోందని డీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కల్పించడం లేదని ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆదివాసీల సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మొదటి నుంచి కృషి చేసిందని చంద్రబాబు అన్నారు.

గిరిజనుల భూములు, ఉద్యోగాలు, అటవీ హక్కుల కోసం ఎన్టీఆర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేసేందుకు షెడ్యూల్డ్ ప్రాంతంలో రద్దు చేసిన జిఓను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం విచారకరం. గిరిజనుల సంప్రదాయ భూములను గిరిజనులకే ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం లేదని ఆరోపించారు. 2016లో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు లేటరైట్‌ పేరుతో దోపిడీ చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. గిరిజన గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎద్దుల బండిపై కిలో మీటర్లు తీసుకెళ్లాల్సి వస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్స్ లు ఇప్పుడు అందుబాటులో లేవని, గిరిజన ప్రాంతాల్లోని రోగులకు వారాంతంలో మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ అంబులెన్స్ సేవలు కూడా ఎక్కడా లేవని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ గిరిజనులు తాగేందుకు కలుషిత నీటిని వాడుతున్నారని, దీంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.