CBN Vs YS Jagan : చంద్ర వ్యూహంలో జ‌గ‌న్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చించ‌డంలో దిట్ట‌.

Published By: HashtagU Telugu Desk
Jagan Reverse Attack

Cbn Jagan

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చించ‌డంలో దిట్ట‌. ఆయ‌న ర‌చించిన ప‌ద్మ‌వ్యూహంలో సీఎం జ‌గ‌న్ చిక్కుకుంటున్నాడు. అభిమ‌న్యుడు మాదిరిగా లోప‌ల‌కు వెళుతోన్న జ‌గ‌న్ మ‌ళ్లీ ఆ వ్యూహం నుంచి తిరిగి రాలేక‌పోతున్నాడు. మూకుమ్మ‌డిగా వ్య‌వ‌స్థ‌లన్నీ ప్ర‌భుత్వాన్ని చుట్టుముడుతున్నాయ‌నే సోయ లేకుండా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తున్నాడు.అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ మ‌హాపాద‌యాత్ర‌ను చేస్తోంది. తొలి రోజుల్లో అడ్డుకోవాల‌ని చూసిన జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న గ‌మ‌నించిన ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లును ర‌ద్దు చేసుకుంది. మ‌రో రూపంలో వ‌స్తానంటూ మేక‌పోతుగాంభీర్యాన్ని జ‌గ‌న్ ప్రద‌ర్శిస్తున్నాడు. ర‌ద్దు చేసిన బిల్లు తిరిగి అసెంబ్లీకి రాకుండా జాతీయ స్థాయి ఉద్య‌మానికి అమరావ‌తి రైతులు సిద్ధం అవుతున్నారు. అందుకోసం బీజేపీ మ‌ద్ధ‌తును తీసుకుంటున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. సుమారు 71 డిమాండ్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌ట్టేలా పోరాటానికి సిద్ధం అయ్యారు. ప్ర‌భుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ఓటీఎస్ ను జ‌గ‌న్ తీసుకొచ్చాడు. ఎప్పుడో మంజూరైన ఇళ్ల‌కు రిజిస్ట్రేష‌న్లు, పట్టాల‌కు ప‌త్రాలు అంటూ అప‌రాధ రుసుంను భారీగా వ‌సూలు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. సుమారు 50 ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాలు జ‌గ‌న్ వాల‌కాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి.మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని నిర్మించాల‌ని ఆనాడు తీర్మానించాడు. ఇప్పుడు దాని గురించి జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ద‌ళితులు విగ్ర‌హం గురించి నిల‌దీసే ప‌రిస్థితికి వ‌చ్చారు. తాజాగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను ఇరుకున పెట్టేలా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. లేవౌట్ల‌లో క‌నీసం 5శాతం భూమి లేక దాని విలువ‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని కండిష‌న్ పెట్టాడు. జ‌గ‌న‌న్న కాల‌నీల‌కు ఆ నిధుల‌ను ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. దీంతో ఆ రంగం మీద ఆధార‌ప‌డ్డ రియ‌ల్డ‌ర్లు జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఆగ్ర‌హంగా ఉన్నారు.

ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ నిర్ణ‌యం మీద నిరుద్యోగులు, యాజ‌మాన్యాలు రోడ్డు మీద‌కు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఉద్యోగాల క‌ల్ప‌న లేక‌పోవ‌డంతో నిరుద్యోగ భృతి కోసం విద్యార్థి సంఘాలు ధర్నాల‌కు దిగే ప‌రిస్థితి ఉంది. మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేయాల‌ని త్వ‌ర‌లోనే రంగంలోకి దిగ‌డానికి మ‌హిళా సంఘాలు సిద్దం అవుతున్నాయి. సినిమా రంగం త‌ర‌హాలోనే నిర్మాణ, త‌యారీ త‌దిత‌ర రంగాల‌కు సంబంధించిన వాళ్లు అస‌హ‌నంగా ఉన్నార‌ని తెలుస్తోంది.పోల‌వరం ప్రాజెక్టును స‌కాలంలో పూర్తి చేయాలేక జ‌గ‌న్ స‌ర్కార్ చేతులెత్తేసింది. అన్న‌మ‌య్య ప్రాజెక్టు కొట్టుకుపోవ‌డం ప్ర‌పంచ వింత‌గా పార్ల‌మెంట్లోనే చ‌ర్చ జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన వ‌ర‌ద న‌ష్టం గురించి పెద్ద‌గా జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌పోవ‌డం, అకాల వ‌ర్షాల‌తో అసంతృప్తిగా ఉన్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల భావ‌న‌. రైతుల‌ను కూడా త్వ‌ర‌లోనే ఉద్య‌మ బాట ప‌ట్టించేలా ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని వినికిడి.

ఒక వైపు న్యాయ‌స్థానాలు ప్ర‌తి అంశం మీదా జ‌గ‌న్ స‌ర్కార్‌కు మొట్టికాయ‌లు వేస్తూనే ఉన్నాయి. మూడు రాజ‌ధానుల అంశంపై అనే సంద‌ర్భాల్లో త‌ప్పుబ‌ట్టింది. న్యాయ‌మూర్తుల‌ను త‌ప్పు బ‌డుతూ వైసీపీ నేతలు చేసిన కామెంట్ల‌ను న్యాయ‌స్థానాలు మ‌రువ‌లేక‌పోతున్నాయి. సుప్రీం చీఫ్ జ‌స్టిస్ మీద లేఖ రాసిన జ‌గ‌న్ వాల‌కం దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇటీవ‌ల టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేసిన తీరు కూడా దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. న్యాయ‌స్థానాలు వ‌ర్సెస్ జ‌గ‌న్ అనే కోణంలో చ‌ర్చ జరుగుతోంది.విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటు క‌ర‌ణపై ఉద్య‌మం కొన‌సాగుతోంది. ఆ విష‌యంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డింది. రైతుల పంపుసెట్ల‌కు మీట‌ర్లు బిగించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. ఆ అంశాన్ని తీసుకుని రైతుల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు రోడ్డు మీద‌కు తీసుకురావ‌డానికి అవ‌కాశం ఉంది. ఇలా..అన్ని వ‌ర్గాలు, అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోని వాళ్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద తిరుగుబాటు దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌కు కార‌ణం జ‌గ‌న్ స్వ‌యం కృతాప‌రాధ‌మా?చంద్ర‌బాబు వ్యూహ‌మా? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

  Last Updated: 07 Dec 2021, 04:19 PM IST