Chandrababu Tweet: `గ‌డ‌ప‌గ‌డ‌ప‌`కు `కేసు`ల లొల్లి!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప`కు ప్ర‌జాప్ర‌తినిధులు వెళుతున్నారు.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 02:27 PM IST

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప`కు ప్ర‌జాప్ర‌తినిధులు వెళుతున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయా? లేదా? తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో జ‌నం నుంచి వ‌స్తోన్న రియాక్ష‌న్ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల‌కు అస‌హ‌నం క‌లిగిస్తోంది. క‌రోనా కార‌ణంగా `వ‌ర్క్ ఫ్రం హోమ్ ` చేసుకుంటున్న యువ‌కులు గ్రామాల్లో ఉంటున్నారు. ప్ర‌జా ప్రతినిధులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వ‌చ్చిన‌ప్పుడు అభివృద్ధి గురించి ప్ర‌శ్నిస్తున్నారు. స్కీమ్ ల గురించి కూలకుషంగా నిల‌దీస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక మొఖం చాటేస్తున్నారు. మ‌రికొంద‌రు ప్ర‌శ్నించిన యువ‌కుల‌పై కేసులు పెట్టిస్తున్నారు. మ‌రికొంద‌రు ప్ర‌శ్నించిన వాళ్ల‌ను బూతులు తిడుతున్నారు. ఆ జాబితాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఉన్నారు. ఆయ‌న వాల‌కం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేల‌కు మాజీ మంత్రి బాలినేని పరిస్థితి ఉంది. వారం క్రితం మంత్రి అంబ‌టి రాంబాబును గ్రామాల్లోని మ‌హిళ‌లు వెంబ‌డించిన వీడియోను చూశాం. గోదావ‌రి జిల్లాల్లోనూ ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్నారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి కొంద‌రు ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో ప్ర‌శ్నించిన వాళ్ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అలాంటి సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా వేపనపల్లి గ్రామంలో జ‌రిగింది. అక్క‌డి యువ‌కుడు ఎమ్మెల్యేని నిల‌దీశారు. దీంతో విద్యార్థిపై కేసు పెట్టారు. అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసులు పెట్టారు. ఆ సంఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆ కేసుల‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరినీ విడుదల చెయ్యాలని అన్నారు. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు గోదావ‌రి జిల్లాల్లోని ముంపు గ్రామాల‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా పున‌రావాస శిబిరాల్లో స‌హాయం ఆశించిన విధంగా అంద‌డంలేద‌ని బాధితులు చెప్పారు. అక్క‌డ నుంచి చంద్ర‌బాబు వెళ్ల‌గానే ఫిర్యాదు చేసిన బాధితుల‌ను శిబిరాల నుంచి బ‌య‌ట‌కు పంపారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా వేప‌న‌ప‌ల్లి సంఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళుతోన్న ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్న ప్ర‌జ‌లంద‌రిపైనా కేసులు పెడ‌తారా? అంటూ నిల‌దీశారు. మొత్తం మీద గ‌డ‌ప‌గ‌డ‌ప వైసీపీ ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు ఒక స‌వాల్ గా మారింది.