Pawan Kalyan& Chandrababu : ప్ల‌స్ లో మైన‌స్

రాజ‌కీయ వ్యూహాల‌ను ప‌న్న‌డంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు దిట్ట‌. కానీ, ఆ వ్యూహాలు ఫ‌లించిన సంద‌ర్భాల కంటే ఫెయిల్ అయిన సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌.

Published By: HashtagU Telugu Desk
Chandrababu Pawan

Chandrababu Pawan

రాజ‌కీయ వ్యూహాల‌ను ప‌న్న‌డంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు దిట్ట‌. కానీ, ఆ వ్యూహాలు ఫ‌లించిన సంద‌ర్భాల కంటే ఫెయిల్ అయిన సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌. ఎన్టీఆర్ బ‌తికి ఉన్నంత వ‌ర‌కు బాబు ర‌చించిన తెర‌వెనుక రాజ‌కీయ చ‌తురత మాత్ర‌మే విజ‌య వంతం అయింది. ఆ త‌రువాత 1999లో మాత్ర‌మే బాబు రాజ‌కీయ వ్యూహం ఫ‌లించింది. ఆనాడు కూడా 13 రోజులు పీఎంగా చేసిన వాజ్ పేయ్ కు వ‌చ్చిన సానుభూతి కార‌ణంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చాడు. ఆ త‌రువాత 2004 ఎన్నిక‌ల్లో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయాడు. ఆనాటి నుంచి ఆయ‌న వేసిన ప్ర‌తి ఎత్తుగ‌డ తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తూ వ‌చ్చిందే.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు చాలా బ‌లంగా ఉండేది. బీసీలు ఎప్పుడూ అండ‌గా ఉంటూ తెలంగాణాలో పార్టీని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌తికించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చేసిన ప‌టేల్ , ప‌ట్వారీ వ్య‌వ‌స్థ ర‌ద్దుతో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు సొంత పార్టీగా టీడీపీ ఉండేది. అందుకే,ఏపీ కంటే తెలంగాణలోనే ఆ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండే వాళ్లు. ప్ర‌త్యేక తెలంగాణ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఆడిన గేమ్ లో చంద్ర‌బాబు ప‌డిపోయాడు. స‌మైఖ్యాంధ్ర నినాదాన్ని కాద‌ని తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్ర‌ణ‌బ్ క‌మిటీకి లెట‌ర్ ఇచ్చాడు. 2009 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పొత్తు కోసం తెలంగాణ‌కు వ్య‌తిరేకం కాదంటూ లెట‌ర్ ఇవ్వ‌డంతో టీడీపీ ప‌త‌నం ప్రారంభం అయింది. ఆ లెట‌ర్ తో ఏపీ ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు తిక‌మ‌క పెట్టాడు. తెలంగాణ‌కు అనుకూల‌మా? అనే ప్ర‌శ్న వేసిన ప్ర‌తిసారీ విచిత్రంగా వ్యతిరేకం కాదంటూ మ‌ధ్యేమార్గంగా వాయిస్ వినిపించాడు. దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబును పూర్తిగా నమ్మ‌లేదు. ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న లేఖ‌ను అనుమానించారు. ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలా? అంటూ వైఎస్ చేసిన ప్ర‌సంగం కాంగ్రెస్ పార్టీని 2009 లో మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చింది.

వ్యూహాత్మ‌కంగా 2009 ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ క్ర‌మంగా చంద్ర‌బాబును జీరో చేశాడు. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ప‌నిచేసిన కేసీఆర్ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని టీడీపీని నామ‌రూపాల్లేకుండా చేశాడు. తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ గులాబీ గూటికి వెళ్లిపోయింది. పొత్తు రూపంలో చేసిన చారిత్ర‌క త‌ప్పిందం తెలుగుదేశం పార్టీని ప్ర‌శ్నార్థ‌కం చేసింది. ఇక రాష్ట్రం విభ‌జ‌న స‌మ‌యంలోనూ టెంకాయ సిద్దాంతాన్ని బాబు వినిపించాడు. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అనుమానం వ‌చ్చేలా ఆయ‌న వాయిస్‌ వినిపించాడు. జ‌గ‌న్ రూపంలో స‌మైఖ్య నినాదం బ‌లంగా ఏపీలో వెళ్లింది. దీంతో 2014 ఎన్నిక‌ల్లో అధికారం కోసం త‌డ‌బ‌డుతూ చివ‌రకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రోజున ఆయ‌న కంటే ఒక‌రిద్ద‌రు కీల‌క లీడ‌ర్ల దూకుడుగా వెళ్లి బీజేపీతో చేతులు క‌లిపారు ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో చావుత‌ప్పి క‌న్నుపోయిన చందంగా అధికారంలోకి వ‌చ్చాడు. విభ‌జిత ఏపీకి బాబు సీఎం కాగ‌లిగాడు.తొలి రెండేళ్లు ప‌రిపాల‌న‌లోనూ చంద్ర‌బాబు త‌డ‌బ‌డ్డాడు. ఓటుకు నోటు కేసులో ఘోరంగా బ‌ద్నాం అయ్యాడు. గ‌తిలేని ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ ను వీడి అమ‌రావ‌తికి వెళ్లాడు. ఆ త‌రువాత ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి తీసుకుని మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చాడు. బ‌హుశా దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అలాంటి పరిణామం ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌లేదు. ఇక అమ‌రావ‌తిని తాత్కాలిక రాజ‌ధాని అంటూ 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు చెప్పాడు. ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ ఘోర త‌ప్పిదం చంద్ర‌బాబు చేశాడు. ప్యాకేజి కి అంగీక‌రించిన ఆయ‌న కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి అభినంద‌న స‌భ‌లు పెట్టాడు. ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మంకు జ‌గ‌న్ న‌డుంబిగించాడు .దీంతో బీజేపీతో చంద్ర‌బాబు క‌టీఫ్ అయ్యాడు. ధ‌ర్మ‌యుద్ధం అంటూ 2019 ఎన్నిక‌ల ముందు మోడీకి వ్య‌తిరేకంగా స‌భ‌లు పెట్టాడు. ప్ర‌త్యేక హోదా కోసం మ‌ళ్లీ డిమాండ్ ను అందుకున్నాడు. నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇలా రెండు ర‌కాలుగా చంద్ర‌బాబు నినాదం చేయ‌డం ప్ర‌జ‌ల‌కు ఏవ‌గింపు క‌లిగించింది. ఫ‌లితంగా 23 స్థానాల‌కు టీడీపీ ప‌రిమితం అయింది..

Prashant Kishor : మూడు పార్టీల ముద్దుల‌ ‘పీకే’

ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం అర్రులు చాస్తున్నాడు. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని వెళ్లాల‌ని రాజ‌కీయ చ‌తుర‌త‌ను బాబు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఆయ‌న వేస్తోన్న అడుగుల‌ను బీసీలు, అగ్ర‌వ‌ర్ణ పేద‌లు గ‌మ‌నిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోడీ ప్ర‌క‌టించిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించాడు. ఆ కార‌ణంగా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉండే అ్ర‌గ‌వ‌ర్ణ పేద‌లు, బీసీలు జ‌గ‌న్ వైపు మ‌ళ్లారు. కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ కోసం ప‌ట్టుబ‌డుతోన్న జ‌న‌సేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల నాటి స‌మీక‌ర‌ణకు అవ‌కాశం లేక‌పోలేదు. వాస్తవంగా జ‌న‌సేన, బీఎస్పీ, వామ‌ప‌క్షాలు కూట‌మిగా 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే వ‌చ్చిన ఓటు బ్యాంకు 4శాతంలోపే. దానిలో జ‌న‌సేన ఓటు షేర్ ఎంత అనేది ఎవ‌రైనా అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఈ లాజిక్ ను గ‌మ‌నించ‌కుండా చంద్ర‌బాబు జ‌నసేన పాట పాడుతూ మ‌రోసారి ఫెయిల్యూర్ దిశ‌గా వెళుతున్నాడ‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు కీల‌క లీడ‌ర్ల త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మొత్తం మీద 44 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు వేసిన రాజ‌కీయ వ్యూహాల్లో ఫ‌లించిన‌వి త‌క్కువ‌కాగా, ఫెయిల్యూర్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన తో పొత్తు అనేది బాబు రాజ‌కీయ వ్యూహాల్లోని ఫెయిల్యూర్ జాబితాలోకి వెళుతుందా? లేక రాజ్యాధికారాన్ని మ‌రోసారి ఇస్తుందా? అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌.

  Last Updated: 28 Feb 2022, 02:42 PM IST