ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ, తన పాలన విధానంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తాను డైలాగులు చెప్పే రకం కాదని, చెప్పింది చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి తాను రాలేదని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ తన ప్రభుత్వానికి ముఖ్యమేనని, రాష్ట్రాన్ని గత పాలకుల కారణంగా దెబ్బతిన్న స్థితి నుంచి బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని అన్నారు.
Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
చినగంజాం మండలంలో పర్యటించిన చంద్రబాబు దివ్యాంగురాలైన సుభాషిణికి రూ.15 వేల పింఛన్ అందజేశారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కూలదోసే పనులు చేసింది కానీ, తాను పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పింఛన్ పొందే విధానం కఠినంగా ఉండేదని, అయితే ఇప్పటికే తాను కొత్త మార్పులు తీసుకొచ్చి, ఏ మూడు నెలల కాలంలోనైనా ప్రజలు పింఛన్ తీసుకునే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు.
తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గట్టిగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి తన ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, ఈ దిశగా ‘పేదరికం లేని సమాజం’ అనే లక్ష్యంతో P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. తన పాలనలో ఏ చిన్న లోటూ ఉండకూడదని ప్రజలకు హామీ ఇస్తూ “మేం డైలాగులు చెప్పం.. చేసి చూపిస్తాం” అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.