“కలిసే ఉంటాం, కలకాలం కూటమిగానే పోటీ చేస్తామని” అని చంద్రబాబు ప్రకటించారు. ఇక, “పెద్దాయనే సీఎం, ఇంకో పదేళ్ల పాటు ఆయన నాయకత్వంలో పాలన సాగాలని” జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడుతూ, “బాబు అనుభవం ఏపీకి చాలా అవసరమని” కూడా చెప్పారు. ఈ మాటలు చూస్తుంటే, ఆ ఇద్దరి ఆలోచన ఒకే విధంగా ఉందంటూ చర్చ మొదలైంది.
“లాంగ్ లివ్ కూటమి” అని బాబు ఇచ్చిన సంకేతానికి, పవన్ సపోర్ట్ చేసినట్లుగా అనిపిస్తున్నా? ఇద్దరు కీలక నేతలు ఒకే దారిలో నడవడాన్ని ఎలా చూడాలి? వ్యక్తిగత ప్రయోజనం కంటే ఏపీ సంక్షేమమే ముందు అన్నది పవన్ భావిస్తున్నారా? కూటమి కోసం బాబు… విజనరీకి అండగా పవన్, ఈ స్నేహం ఎక్కడి దాకా కొనసాగుతుందోనని ప్రశ్నలు మొదలవుతున్నాయి.
అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చేస్తున్న చంద్రబాబు, పవన్:
ఎన్నికలు ముగించుకున్న తర్వాత ఆరు నెలలు కూడా పూర్తవలేదు. ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఏపీలో కూటమే అధికారంలో ఉంటుందని చెప్పొచ్చు. అయినప్పటికీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సమయంలోనే అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలపై, వచ్చే ఐదేళ్లలో ఎవరు సీఎంగా ఉండబోతున్నారో తెలియజేస్తూ, క్లారిటీ ఇస్తున్నట్టుగా అర్థం అవుతోంది.
తాజాగా, సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అవును, ఆ ఇద్దరినీ విడదీయలేరు, మూడు పార్టీలను విడదీసేలా ఎవరు అడ్డుకోలేరు అనే స్పష్టత వస్తోంది.
2029 జమిలి ఎన్నికలలో కలిసే పోటీ చేస్తాం:
జమిలి ఎన్నికలు వచ్చే 2029లో ఉన్నా, “కలసే పోటీ చేస్తాం” అని చెప్పిన చంద్రబాబు, “ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాం” అని ప్రకటించడం రాజకీయ వేడి పుట్టిస్తోంది. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, కలిసికట్టుగా ముందుకు పోతున్నామని చెప్పిన చంద్రబాబు, నరేంద్ర మోదీనే తమ నాయకుడిగా స్పష్టత ఇచ్చారు. కొన్నిసార్లు కూటమి నేతల మధ్య గ్యాప్ ఉండటం, కలసి నడవటం లేదనే వార్తలు వచ్చినప్పటికీ, బాబు చేసిన వ్యాఖ్యలతో అవి సెట్‌రైట్ అయిపోతాయి. అంతలో, బాబు వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ, మరొక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నవ్యాంధ్ర రాజకీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
హాట్ టాపిక్‌గా మారిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు:
మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని అసెంబ్లీ వేదికపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒక క్రైసిస్ సమయంలో నాయకుడు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని చంద్రబాబును చూస్తే అర్థమవుతుందని చెప్పిన పవన్, బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవను గొప్పగా అభిప్రాయపడ్డారు. అనుభవంతో కూడిన చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా పవన్ అన్నారు.
అయితే, సీఎంకి మాట ఇస్తున్నాం, తాము చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. “సీఎం చంద్రబాబు చూపించిన విజన్‌కు తగ్గట్టుగా పని చేస్తాం, ఆయన కలలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాము” అని పవన్ పేర్కొన్నారు.
మొన్న చంద్రబాబు..ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకే లైన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కూటమి లాంగ్ టర్మ్‌లో ఉంటుందని బాబు అంటుంటే..కూటమే కాదు బాబే మరో పదేళ్లు సీఎంగా ఉంటారని పవన్ అనడం అయితే ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ మాటలతో కూటమి ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు నేతలు.
పట్టు, అనుభవం వచ్చాకే సీఎం కుర్చీలో కూర్చోవాలని పవన్ భావిస్తున్నారా?
పవన్ కళ్యాణ్ ఏం చేసినా స్పష్టతతోనే చేస్తారని చెబుతారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి సారి పోటీ చేయలేదు, రెండోసారి సత్తా చాటలేకపోయినా భయపడలేదు. మూడోసారి మాత్రం విజయవంతంగా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది, ఇందులో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇప్పుడు పాలన విషయంలో కూడా అవగాహన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు, పట్టు పొందిన తరువాత సీఎం కుర్చీ ఆశిస్తే మంచిదని కొంత మంది నేతలు మాట్లాడుకుంటున్నారు.
ప్రభుత్వం నడిపే విషయంలో పూర్తి అనుభవం సాధించిన తరువాత తగిన స్థాయిలో ఉండడం బెటర్ అని పవన్ భావిస్తున్నారని, ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన దూరదర్శితిని ఎవరూ ఆమోదించలేరని అనుకుంటున్నారు.
ఇప్పటికే బాబు, పవన్ ఒకే స్టాండ్‌పై ఉంటూ, కూటమి నేతలకు మంచి సంకేతాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. “ఫ్యూచర్ ఉంది, కన్ఫ్యూజన్ అవసరం లేదు” అని అంగీకరించిన నేతలు, కేవలం కొంత గ్యాప్ ఉంటే అది త్వరలో సెట్ అవుతుందని ధీమాతో ఉన్నారు.