Chandrababu Take Oath : నేను..నారా చంద్రబాబు అను నేను అంటూ ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 11:56 AM IST

ఆంధ్రప్రదేశ్ లో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు.అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించాడు. తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో 1972లో బి.ఎ., తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండడం తో తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు.

We’re now on WhatsApp. Click to Join.

1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు. కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు.1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు.

సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు. 1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పంలో ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు 4 వ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు.

 

Read Also : Chandrababu : చంద్రబాబు తొలిసంతకంలో మార్పు..?