ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సింగపూర్ పర్యటనకు ఈరోజు( జులై 26న ) బయలుదేరుతున్నారు. ఆరు రోజుల ఈ పర్యటన జులై 31 వరకు కొనసాగనుంది. ఈ పర్యటన (Singapore Tour) ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ‘బ్రాండ్ ఏపీ’ని అంతర్జాతీయ వేదికలపై ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఉంది. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా ఈ పర్యటనలో భాగంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబుకు ఇది రెండో విదేశీ పర్యటనగా నిలవనుంది.
ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రముఖ గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులు తదితరులతో సమావేశమవుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 1,053 కి.మీ. తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్డు నెట్‌వర్క్, నీటి వనరులు, యువతలోని స్కిల్స్ వంటి అంశాలపై దృష్టి సారించి పెట్టుబడులను రప్పించేందుకు విశేషంగా ప్రయత్నించనున్నారు. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, ఎయ్ ఐ, పోర్ట్ ఆధారిత పరిశ్రమల వంటి రంగాల్లో రాష్ట్రంలో అవకాశాలున్నాయంటూ ఆయా సంస్థలకు వివరిస్తారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరగనున్నాయి.
Thailand : థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులకు హెచ్చరిక
పర్యటన ప్రారంభ దశలో సింగపూర్ మరియు ఇతర ఆసియాలోని తెలుగు డయాస్పోరాతో చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి వారి భాగస్వామ్యం అవసరమని, పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ (P4) మోడల్‌లో కలిసిపనిచేయాలని కోరనున్నారు. ఫిన్‌టెక్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో బిజినెస్ రౌండ్‌టేబుల్, బిజినెస్ రోడ్‌షోలు కూడా జరగనున్నాయి. ఇది 2019 తర్వాత అమరావతి ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం పోసే దిశగా ప్రభుత్వం చూస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నీటి సరఫరా, రవాణా, పట్టణాభివృద్ధి అంశాలపై సాంకేతిక సహకారం కోరనున్నారు.
ఈ పర్యటన ద్వారా ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. అమరావతి అభివృద్ధిపై గతంలో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి తెచ్చేందుకు ఇది కీలకమైన యత్నంగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పర్యటనపై విమర్శలు చేస్తోంది. ఇవి కేవలం ప్రచార పర్యటనలే తప్ప, వాస్తవ ప్రయోజనం ఉండదని వాదిస్తోంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చే మూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపకల్పన తీసుకొచ్చి, రాజకీయంగా వైసీపీకి గట్టి సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉంది.