Site icon HashtagU Telugu

Chandra Babu Review : ఇంఛార్జ్‌ల ప‌నితీరుపై చంద్ర‌బాబు స‌మీక్ష‌.. నేత‌ల ప‌నితీరులో మార్పు రాక‌పోతే…?

Chandrababu Kadapa

Chandrababu Kadapa

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. పార్టీ నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు తరువాత పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంట్ ల పై అధినేత సమీక్ష జరిపారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చంద్రబాబు అదేశించారు. వీటితో పాటు ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలు మొదలు పెట్టాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ లో గ్రూపులు కనిపించకూడదని…ప్రజా సమస్యలపై నేతల పోరాటాలు, పార్టీ కార్యక్రమాలు మాత్రమే కనిపించాలని చంద్రబాబు అన్నారు. రోడ్డెక్కని నేతలు.. పని చేయని నాయకుల విషయంలో ఉన్నది ఉన్నట్లు తనకు నివేదికల ద్వారా తెలపాలని పార్లమెంట్ కో కోఆర్డినేటర్లకు చంద్రబాబు సూచించారు.

ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్ల పై సమీక్ష జరిపారు. శ్రీకాకుళం- విజయనగరం పార్లమెంట్ల కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్మెల్యే గణబాబు, విశాఖ- అనకాపల్లి పార్లమెంట్ల కో ఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రి చిన రాజప్ప లతో చంద్రబాబు విడివిడిగా సమీక్ష జరిపారు. అనంతరం జోన్ 1 ఇంచార్జ్ బుద్దా వెంకన్నతో చంద్రబాబు రివ్యూ చేశారు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే, పార్టీ క్యాడర్ ను పట్టించుకోని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. నేతల పనితీరుపై లోతైన సమాచారంతో నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు సమీక్షల సందర్భంగా నేతలకు ఆదేశించారు. 15 రోజుల పాటు పార్లమెంట్ కో ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని చంద్రబాబు సూచించారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించేది లేదని…ఇదే విషయాన్ని ఆయా నేతలకు అర్థం అయ్యేలా చెప్పాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇంచార్జ్ ల విషయంలో అంతిమంగా వారి పనితీరు మాత్రమే ప్రామాణికంగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా నేతలకు స్పష్టం చేశారు.