Site icon HashtagU Telugu

Chandrababu: భీమ్లా నాయక్ మూవీ పై చంద్రబాబు ట్వీట్.. ఏమ‌న్నారంటే..?

Chandrababu Pawan Kalyan

Chandrababu Pawan Kalyan

జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ కళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా ఈ రోజు విడుద‌లైంది. అయితే భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఏపీలోని థియేట‌ర్లో టికెట్ రేట్లను ప్ర‌భుత్వం త‌గ్గించింది. భీమ్లానాయ‌క్ సినిమాపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని..చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందన్నారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని.. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమా పై ఎందుకు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమ‌ని తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే….ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నార‌న్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుందని..భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నానని చంద్ర‌బాబు అన్నారు.