AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 10:58 PM IST

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదని, రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే వుందని చంద్రబాబు దుయ్యబట్టారు. యువతకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా టీడీపీ చేస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి వుంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్న ఆయన.. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమైందని.. ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను ఏపీ నుంచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. గల్లా కుటుంబం రాజకీయాలే వద్దనే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్‌కు సబ్జెక్టు ఏమీ లేదని, బిల్డప్పులు మాత్రమే ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా అభివృద్ధి టీడీపీ, జనసేన పొత్తుతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచిందని.. కానీ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని.. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్లు అడిగేందుకు జగన్ మళ్లీ వస్తాడని.. అప్పుడు నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని చెప్పి తరిమికొట్టండని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో పనులు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని.. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. ఒక బీసీని చంపిన వ్యక్తులు రోడ్లపై తిరుగుతున్నారని, బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని, జగన్ బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపిన వారు బయట తిరుగుతున్నారని ఆరోపించారు.

ఈ రాష్ట్రాన్ని, తెలుగువారిని ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. తనకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు.. 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు నెమరు వేసుకున్నారని ఓ నాయకుడికి ఇంతకంటే ఏం కావాలని అన్నారు. పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Read Also : Viswak Sen Gami First Look : అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ.. గామి ఫస్ట్ లుక్.. విశ్వక్ సేన్ షాకింగ్ లుక్..!