Site icon HashtagU Telugu

CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Cm Chandrababu Visits Durgamma Temple

Cm Chandrababu Visits Durgamma Temple

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తిరుపతి తర్వాత, దుర్గగుడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం అని వెల్లడించారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని గుర్తుచేసారు.

ఈసారి ఉత్సవ కమిటీ బదులుగా సేవ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా, నిన్నటి వరకు 5,85,651 భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించారని వెల్లడించారు. దసరా సందర్భంగా దేవాదాయశాఖ మంచి ఏర్పాట్లు చేసిందన్నారు. ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని, కృష్ణానదిలో అనూహ్యంగా వరద వచ్చిందన్నారు. త్వరలో అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం ఉంటుందని, అమ్మ దయ వల్ల త్వరగా పూర్తి కావాలని దుర్గమ్మను కోరానన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

బుధవారం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడి అర్చకులు మరియు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద, అర్చకులు సీఎంకు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ, సీఎం సతీసమేతంగా ప్రభుత్వ తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం, సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.

అంతకుముందు, ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. ఇటీవల వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిసరాల్లో జరిగిన నష్టాలను మరియు పునరుద్ధరణ తర్వాతి పరిస్థితులను చూపించే ఫోటోలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజన చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.