Chandrababu : మూడుపై బాబు మూడోక‌న్ను.!

ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్ద‌లు. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల ఉద్య‌మాల‌తోనే టార్గెట్ చేయాల‌ని చంద్ర‌బాబు మాస్ట‌ర్ స్కెచ్ వేశాడు. అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఆయ‌న పాత్ర ఉంది. ఆ విష‌యాన్ని వైసీపీ ప‌దేప‌దే చెబుతోంది.

  • Written By:
  • Publish Date - December 18, 2021 / 12:16 PM IST

ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్ద‌లు. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల ఉద్య‌మాల‌తోనే టార్గెట్ చేయాల‌ని చంద్ర‌బాబు మాస్ట‌ర్ స్కెచ్ వేశాడు. అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఆయ‌న పాత్ర ఉంది. ఆ విష‌యాన్ని వైసీపీ ప‌దేప‌దే చెబుతోంది. ఇదే దూకుడును కొన‌సాగించేలా అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ‌ స‌మితి దీర్ఘ‌కాలిక పోరాటానికి సిద్దం అవుతోంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయ బిల్లుల‌పై ఉద్య‌మించిన రైతు నాయ‌కుడు తికాయ‌త్ ను రంగంలోకి దింప‌డానికి సిద్దం అవుతున్నారు.విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఏడాది కాలంగా కార్మికులు రిలే నిరాహాదీక్ష‌లు చేస్తున్నారు. వాళ్ల‌కు ఆయా పార్టీల మ‌ద్ధ‌తు సంపూర్ణంగా ఉంది. ఢిల్లీ వ‌ర‌కు ఈ ఉద్య‌మాన్ని తీసుకెళ్లడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కార్మికుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌న‌సేన పార్టీ అండ‌గా నిలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌వ‌న్ లేఖ రాశాడు. అక్క‌డ నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో విజ‌య‌వాడ కేంద్రంగా విశాక ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకంగా ఒక రోజు దీక్ష‌ను జ‌న‌సేనాని చేశాడు. నేరుగా విశాఖ‌కు వెళ్లి కార్మికుల‌కు అండ‌గా నిల‌వ‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్ప‌టికే డిజిట‌ల్ యుద్ధాన్ని ప్రారంభించాడు.

క‌డ‌ప జిల్లాలోని యురేనియం త‌వ్వ‌కాలు చాలా కాలంగా జ‌రుగుతున్నాయి. వాటి కార‌ణంగా గ్రామాల‌కు గ్రామాల‌కు క‌నుమ‌రుగు అవుతున్నాయి. ప‌రిస‌ర ప్రాంతాల్లో పంట‌లు పండ‌డంలేదు. దీంతో ఆయా గ్రామా రైతులు ఆగ్ర‌హంగా ఉన్నారు. దీనితో పాటు పోతిరెడ్డి పాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కం విష‌యంలో కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య న‌డుస్తోన్న లోగుట్టు వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు తీయ‌డానికి రైతు సంఘాల నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అటు యురేనియం ఇటు పోతిరెడ్డిపాడు అంశాల‌ను తీసుకుని రాయ‌ల‌సీమ రైతుల‌ను ఉద్య‌మ‌ప‌థాన న‌డిపించాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది.పోల‌వరం ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యాన్ని ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల రైతులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పైగా పున‌రావాస ప‌రిహారం చెల్లింపు విష‌యంలో వైఫ‌ల్యం చెందిన అంశాన్ని ఎత్తిచూప‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అక్క‌డి రైతుల‌ను ధ‌ర్నా వైపు మ‌ళ్లించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏపీలోని ఉత్త‌రాంధ్ర‌, మ‌ధ్య ఆంధ్ర‌, కోస్తా ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల రైతులను ఒకేసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద తిర‌గ‌బ‌డేలా చేయాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఇప్ప‌టికే ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ పోరాడుతోంది. ఇక రాయ‌ల‌సీమలోని యురేనియం త‌వ్వ‌కాలు, సాగునీళ్ల ఉద్య‌మ దూకుడు పెంచ‌డానికి కామ్రేడ్లు సిద్ధం అవుతున్నారు. పోల‌వ‌రం,పున‌రావాసం అంశాల‌పై పెద్ద ఎత్తున రైతుల‌ను స‌మీక‌రించే ప‌నిలో కొంద‌రు రైతులు నాయ‌కులు ప‌నిచేస్తున్నార‌ని తెలిసింది. మొత్తం మీద ఏపీలోని నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు ప్ర‌ధాన అంశాల‌ను తీసుకుని రైతుల‌ను, కార్మికుల‌ను ఒకేసారి ఉద్య‌మం వైపు న‌డిపించాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ చంద్ర‌బాబు వేశాడ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో వినికిడి. దీన్ని జ‌గ‌న్ స‌ర్కార్ ఏ విధంగా అడ్డుకోగ‌ల‌దు? అనేది చూడాలి.