AP Politics : ఏపీ రాజ‌కీయాన్ని మ‌లుపుతిప్పే ఎన్నిక‌పై బాబు చాణ‌క్యం

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, ఉప ఎన్నిక‌లు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు పైచేయిగా వైసీపీ ఉంది.

  • Written By:
  • Updated On - June 24, 2022 / 01:02 PM IST

ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, ఉప ఎన్నిక‌లు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు పైచేయిగా వైసీపీ ఉంది. అస‌లు సిస‌లైన ఛాలెంజ్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎదురుకానుంది. ఆయ‌న పాల‌న‌కు త్వ‌ర‌లో జ‌రిగే ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల‌ను గీటు రాయిగా తీసుకోవ‌చ్చు. మూడేళ్ల పరిపాల‌న‌కు ప‌ట్ట‌భ‌ద్రులు ఇచ్చే తీర్పు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతోన్న పార్టీల‌కు ఒక అగ్ని పరీక్షగా నిల‌వ‌నుంది. అందుకే, చంద్ర‌బాబు నాయుడు ముందుగా టీడీపీ అభ్య‌ర్థిగా శ్రీకాంత్ ను ప్ర‌క‌టించ‌డం ద్వారా దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వాస్త‌వంగా జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల్లో మంచి సీఎంగా గుర్తింపు పొందుతాను అంటూ తొలి రోజుల్లో చెప్పారు. ఆ త‌రువాత ఏడాది టైం ఇవ్వండ‌ని అడిగారు. ఆ లోపు క‌రోనా రావ‌డంతో వ్య‌వ‌స్థ గాడి త‌ప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప‌రిపాల‌న‌పై ప‌ట్టు సాధించ‌డానికి స‌రిపోయింది. తొలి రోజుల్లో ప‌లు జీవోలు ఇవ్వ‌డం వాటిని తిరిగి ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. ప‌రిపాల‌న మీద పూర్తి అవ‌గాహ‌న లేద‌ని చెప్ప‌డానికి జీవోల ర‌ద్దును కొన‌మానంగా తీసుకోవ‌చ్చు. మూడేళ్ల ఆయ‌న పరిపాల‌న సంక్షేమం దిశ‌గా సాగింది. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాన్ని నిర్వీర్యం చేయ‌డానికి అధికార దుర్వినియోగం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ల‌పైన‌ ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు ఒక్క‌దాన్ని కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రూ చేయ‌లేక పోయారు. అమ‌రావ‌తి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, ఐఎస్ఐ స్కామ్ నుంచి క‌ర‌క‌ట్ట ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు వ‌ర‌కు ఒక్క‌దానిలోనూ జగన్ మోహన్ రెడ్డి విజ‌యం సాధించ‌లేదు.

ప‌రిపాల‌న మీద అవ‌గాహ‌న పెంచుకోవ‌డానికి ఆయ‌న‌కు ఇంకా టైం ప‌ట్టేలా ఉంది. న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తూ ఇప్పుడిప్పుడే ప‌రిపాల‌న మీద దృష్టి పెట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఉద్యోగ‌, ఉపాథి అవ‌కాశాల క‌ల్ప‌న‌తో పాటు యువ‌త‌కు నిరుద్యోగ‌భృతి వ‌ర‌కు దేన్నీ కార్య‌చ‌ర‌ణ‌లోకి తీసుకురాలేక‌పోయారు. కానీ, మూడేళ్ల కాలంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్ధ‌ల ఎన్నిక‌లు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తిరుగులేకుండా వైసీపీ గెలుస్తూ వ‌చ్చింది. ఆ ఫ‌లితాల‌ను గీటురాయిగా చూపుతూ జగన్ మోహన్ రెడ్డి ప‌రిపాల‌న బాగుంద‌ని ఆ పార్టీ శ్రేణులు విశ్వ‌సిస్తున్నాయి. కానీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక‌, ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కొన్ని ద‌శాబ్దాలుగా చూస్తున్నాం. అయితే, ఈసారి జ‌రిగే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం మునుప‌టి ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఉంటుంద‌ని ప్ర‌ధాన పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి.

రాయ‌ల‌సీమ నాడితో పాటు ఏపీ ప్ర‌జ‌ల నాడిని తెలియ‌చేసేలా ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక‌ల ఫ‌లితం ఉంటుంది. అందుకే మూడేళ్లుగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడిన టీడీపీ ఇప్పుడు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల‌పై దూకుడుగా వెళుతోంది. త్వ‌ర‌లో జ‌రిగే ఈ ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ ను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్ర‌క‌టించారు. కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కోశాధికారి, రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధిగా శ్రీకాంత్ ప‌నిచేస్తున్నారు. ఆయ‌న్ను గెలిపించాల‌ని కోరుతూ మూడు జిల్లాల పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులకు చంద్రబాబు ఇప్ప‌టి నుంచే ఫోన్లు చేసి క్షేత్ర‌స్థాయి స‌మీక్ష‌ను మొద‌లు పెట్టారు.

తాజాగా ఐప్యాక్ ఇచ్చిన స‌ర్వే ప్ర‌కారం యువ‌త‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, వ్యాపార‌, పారిశ్రామిక వ‌ర్గాలు వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన ప‌ట్ట‌భ‌ద్రులు జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓట్లు వేయాలి. ఈ ఎన్నికల్లో ఓట్లు ఉన్న వాళ్లంద‌రూ క‌నీసం డిగ్రీ చేసిన వాళ్లు ఉంటారు. సాధార‌ణంగా రాజ‌కీయ పార్టీలు ప్ర‌యోగించే లిక్క‌ర్, డ‌బ్బు త‌దిత‌ర తాయిలాల‌కు ప‌డ‌రు. అందుకే, అస‌లు సిస‌లైన ఎన్నిక‌గా దీన్ని తీసుకోవ‌చ్చు. ఒక వేళ ఈ ఎన్నిక‌లోనూ వైసీపీ అభ్య‌ర్థి గెలిస్తే మాత్రం ఆ పార్టీ 2024 దిశ‌గా మ‌రింత స్పీడుగా వెళ్లే అవ‌కాశం ఉంది. అదే, టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తే, 2024 ఎన్నిక‌ల్లో అధికారం కోసం మ‌రింత‌ దూకుడుగా అడుగులు వేయ‌డానికి బాబు వ్యూహాలు ర‌చిస్తారు. మొత్తం మీద జ‌గ‌న్ పాల‌న‌ను ఒక గీటు రాయిగా తీసుకోవ‌డానికి అవకాశం ఉన్న ఎన్నిక కావ‌డంతో చంద్ర‌బాబు చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవ‌డానికి టీడీపీ శ్రేణులు కూడా సిద్ధం అయ్యాయి. సమీప భ‌విష్య‌తులో జ‌రిగే ఈ ఎన్నిక‌ ఏపీ రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్ప‌నుంది.