ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నారా లోకేశ్(Nara Lokesh)కి ఇచ్చే “ప్రమోషన్” పై చర్చలు నడుస్తున్నాయి. కూటమి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) నేతలు ప్రస్తుతం లోకేశ్‌కి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో లోకేశ్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది తెలంగాణలో కేసీఆర్ (KCR) తనయుడు కేటీఆర్(KTR)కు ఇచ్చిన పాత్ర తరహాలోనే ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మహానాడు వేదికపై కీలక ప్రకటన..?
ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు సభలను అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ముఖ్యంగా మే 29న జరుగనున్న భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ముఖ్యమైన ప్రకటనలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా లోకేశ్‌కి పదోన్నతి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే లోకేశ్ రాష్ట్ర మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలోనూ, పాలనలోనూ సీనియర్ నేతగా ఎదిగిన లోకేశ్‌కి మరింత బాధ్యతలు అప్పగించేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు.
పాలనపై పూర్తి దృష్టి పెట్టాలన్న చంద్రబాబు యోచన
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. రెవెన్యూ లోటు, అప్పుల భారం వంటి సమస్యల్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు, జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో పాలనపై పూర్తి దృష్టి పెట్టాలంటే పార్టీ బాధ్యతలను లోకేశ్‌కి అప్పగించడం లాజికల్ చాయిస్‌గా కనిపిస్తోంది. వయోభారాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, యువనేతకు అవకాశం ఇవ్వాలన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సూచన.
పవన్ కల్యాణ్ స్థాయిలో లోకేశ్‌కు ప్రాధాన్యం..?
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయనకు ఉన్న ప్రజాదరణ, కేంద్ర నేతలతో ఉన్న అనుబంధం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అదే స్థాయిలో లోకేశ్‌కి కూడా ప్రాధాన్యం కల్పించాలని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పగ్గాలను లోకేశ్ చేతికి అప్పగిస్తే, ఆయన యువతతో మమేకమయ్యే శక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. పైగా ఇది టీడీపీకి వచ్చే కాలంలో లాభదాయకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే మే 29న మహానాడు వేదికగా ఈ కీలక ప్రకటన రావచ్చని అందరూ ఊహిస్తున్నారు.
Read Also : Bangalore Rains : భారీ వర్షాలతో బెంగుళూర్ ఉక్కిరిబిక్కిరి