Chandrababu New Concept : ఉగాది నుంచే అమలు

Chandrababu New Concept : పేదలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి అదనపు చేయూత అందించడానికి ఈ విధానం రూపుదిద్దుకుంది

Published By: HashtagU Telugu Desk
Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లోని అట్టడుగు వర్గాల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘పీ4’ (Public Philanthropic People Participation) కార్యక్రమం ఉగాది నుండి అమలులోకి రానుంది. పేదలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి అదనపు చేయూత అందించడానికి ఈ విధానం రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ‘ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ – బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’ పై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించగా, మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 5,869 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

అర్హుల గుర్తింపు కోసం హౌస్‌హోల్డ్ సర్వే

పీ4 ద్వారా లబ్ధి పొందే అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ప్రభుత్వం జీఎస్‌డబ్ల్యుఎస్ డేటాబేస్, హౌస్‌హోల్డ్ సర్వే, గ్రామసభ ధృవీకరణలను ఆధారంగా తీసుకుంటోంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి కలిగిన భూ యజమానులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఫోర్ వీలర్ వాహనం కలిగిన వారు, 200 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు, మున్సిపల్ ప్రాంతాల్లో సొంత ఇళ్లు ఉన్నవారు ఈ కార్యక్రమం నుంచి మినహాయించబడతారు. ఈ విధానం ద్వారా నిజమైన పేదరికంలో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా ఉంది.

సమృద్ధి బంధనం ద్వారా అనుసంధానం

లబ్దిదారుల ధృవీకరణ పూర్తయ్యాక, సమృద్ధి బంధనం ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయా కుటుంబాల వివరాలను పొందుపరుస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాత్ర అనుసంధానం వరకే పరిమితం అవుతుంది. లబ్ధిదారుల కుటుంబాలను, సహాయం చేయదలచుకున్న కుటుంబాలను అనుసంధానం చేయడం, తగిన విధంగా మానిటరింగ్ చేయడం మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. ఇందులో ఎటువంటి ఆర్థిక ఒత్తిడి ఉండదని, పూర్తిగా స్వచ్ఛందంగా మాత్రమే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పేదరికం నిర్మూలన లక్ష్యంగా పీ4

ఈ ఉగాది నాటికి ‘పీ4’ ప్రారంభమవుతుండగా, 2024 ఆగస్టు నాటికి 5 లక్షల పేద కుటుంబాలను ఈ పథకం కింద తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే, రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు ‘పీ4’ అదనపు భరోసా కల్పించనుంది. పేద కుటుంబాలకు మాత్రమే కాకుండా, సామాజికంగా ఉన్నత వర్గాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తే, పేదరిక నిర్మూలన లక్ష్యం మరింత వేగంగా సాధించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

  Last Updated: 27 Feb 2025, 11:00 PM IST