ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య, నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) మరోసారి తన ప్రతిభను, నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. వ్యాపారరంగంలో అగ్రగామిగా రాణిస్తున్న ఆమెకు ప్రతిష్టాత్మక ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025’ (Distinguished Fellowship award 2025) లభించింది. ఈ అవార్డు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారనేతల నాయకత్వం, సామాజిక బాధ్యత, నైతిక విలువల పట్ల కట్టుబాటును గుర్తించి ఇస్తారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న గ్లోబల్ కన్వెన్షన్‌లో ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. గతంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు ఈ గౌరవాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు నారా భువనేశ్వరి చేరడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా మారింది.
Shubman Gill: గిల్ నామ సంవత్సరం.. 7 మ్యాచ్‌లలో 5 శతకాలు!
భార్యకు ఈ అవార్డు రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన తన సందేశంలో, “మై డియర్ భు, నీ అంకితభావం, క్రమశిక్షణ, నిజాయతీ నన్ను సహా ఎంతో మందిని స్ఫూర్తినిస్తాయి. నీకు లభించిన ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఎంతో గర్వకారణం” అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. తన భార్య యొక్క శ్రమను, విలువలను గుర్తిస్తూ ఆయన రాసిన ఈ మాటలు అభిమానుల హృదయాలను తాకాయి. ఈ సందేశంలో ఆయన ‘నీ మౌనం నీ బలం’ అంటూ భువనేశ్వరి వ్యక్తిత్వంపై ఉన్న తన గౌరవాన్ని కూడా వ్యక్తపరిచారు.
తన పోస్ట్‌లో చంద్రబాబు మరింత ఆసక్తికరంగా, భావోద్వేగంగా మాట్లాడుతూ, “విజయం సాధించిన ప్రతి పురుషుడి వెనుక ఒక బలమైన మహిళ ఉంటుందని అంటారు. కానీ నా విషయంలో నువ్వు నా వెనుక కాదు, నా కంటే ముందే ఉన్నావు. నాకంటే ముందే అవార్డులు అందుకుంటున్నావు” అని పేర్కొన్నారు. ఆయన ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సందేశం ద్వారా చంద్రబాబు తన భార్యపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను చాటుకోవడంతో పాటు, మహిళా నాయకత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను కూడా ప్రతిబింబించారు. ఈ సందర్భంలో ఆయన భువనేశ్వరి అందుకున్న అవార్డు పత్రాన్ని కూడా తన ట్వీట్‌లో పంచుకోవడంతో, అది ప్రజల్లో మరింత చర్చనీయాంశమైంది.
