Chandrababu : సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన నాలుగవ రోజు పర్యటనను బిజీ షెడ్యూల్‌తో కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, పర్యాటక రంగ సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
రియల్ ఎస్టేట్, డిజిటల్ టౌన్‌షిప్స్‌పై క్యాపిటాల్యాండ్‌తో చర్చలు
క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంతో సీఎం రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్‌షిప్స్ వంటి అంశాలపై దృష్టిసారించారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్పేసుల ఏర్పాటుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ చర్చలపై స్పందించిన ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల కోసం ప్రాధాన్యతతో చూడనున్నట్లు తెలిపారు.
వైల్డ్‌లైఫ్, ఎకో టూరిజంపై మందాయ్ గ్రూప్‌తో చర్చలు
పర్యావరణ అనుకూల పర్యాటక అభివృద్ధిపై సీఎం మరో కీలక సమావేశం నిర్వహించారు. మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్‌లేతో జరిగిన సమావేశంలో, వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం జోన్లు, బయో డైవర్సిటీ కాంప్లెక్సులు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఇందుకు అనుకూలంగా రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, తమ సంస్థ ఇలాంటి పెట్టుబడులకు ఆసక్తిగా ఉందని బార్క్‌లే వెల్లడించారు.
సుమితోమో బ్యాంక్‌తో ఆర్థిక సహకారాలపై చర్చలు
జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో ముఖ్యమంత్రి ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాల్లో సహకారం అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని రాజీవ్ తెలిపారు.
టెమసెక్ హోల్డింగ్స్‌తో విస్తృత పెట్టుబడులపై చర్చలు
టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేశ్ ఖన్నాతో సీఎం చంద్రబాబు జరిపిన చర్చల్లో గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అనేక రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై విశ్లేషణ చేసి, ప్రభుత్వంతో మౌలిక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని ఖన్నా హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఫైనాన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలన్నది ముఖ్యమంత్రి ప్రాధాన్యతగా కనిపిస్తోంది. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మరింత పునాదులు వేయనుంది.