AP Floods : వ‌స్తున్నా..వ‌ర‌ద బాధితుల కోసం.!

ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప‌ద‌వుల‌కు అతీతంగా చంద్ర‌బాబు యాక్టివ్ అవుతారు.

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 06:00 PM IST

ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప‌ద‌వుల‌కు అతీతంగా చంద్ర‌బాబు యాక్టివ్ అవుతారు. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జాసేవ కోసం ప్ర‌ణాళిక ర‌చిస్తారు. ప్ర‌స్తుతం గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లోని ముంపు గ్రామాల ప్ర‌జల్ని ప‌రామ‌ర్శించ‌డానికి సిద్దం అయ్యారు. షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో చంద్ర‌బాబు పర్యటించనున్నారు. 20వ తేదీన కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు. నీట మునిగిన పంటపొలాలను ప‌రిశీలిస్తారు. 21వ తేదీన కూనవరం, చింతూరు, ఎటపాక, వీ ఆర్ పురం మండలాలు, 22వ తేదీన రాజోలు, పీ. గన్నవరం నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల‌కు వెళ‌తారు.

ప్ర‌స్తుతం గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో వరదపోటు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట్టం 18.1 అడుగులకు దిగింది. మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తోన్నారు. ప్రస్తుతం సముద్రంలోకి 19.73 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వచ్చిన వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద తగ్గుముఖం పట్టేంత వరకూ లంక గ్రామవాసులు, గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ సూచిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వరద ప్రభావిత జిల్లాలను ప‌ర్య‌వేక్షిస్తోంది.

గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లోని సుమారు 650 గ్రామాల ప్ర‌జ‌లు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో వేలాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులు అయ్యారు. సాధార‌ణంగా చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ముంద‌స్తుగా యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసే అల‌వాటు ఉండేది. అధికారుల‌తో రాత్రింబ‌వ‌ళ్లు స‌మీక్ష చేస్తూ చంద్ర‌బాబు డైరెక్ష‌న్ ఇస్తుండే వాళ్ల‌ను అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. విశాఖ హుద్ హుద్ తుఫాన్ సంద‌ర్భంగా జ‌రిగిన న‌ష్టాన్ని వెంట‌నే భ‌ర్తీ చేసిన విష‌యాన్ని అవ‌లోకిస్తున్నారు.

స్వ‌ర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన తుఫాన్ బీభ‌త్స‌వం సంద‌ర్భంగా హెలికాప్ట‌ర్ ద్వారా చంద్ర‌బాబు ఏరియల్ స‌ర్వేకు వెళ్లారు. ఆ త‌రువాత సీఎం హోదాలో ఆనాడు వైఎస్ అప్ర‌మ‌త్తం అయ్యారు. ఇదంతా గుర్తు చేసుకుంటోన్న టీడీపీ శ్రేణులు ప్ర‌స్తుతం ముంపు గ్రామాల‌కు చంద్ర‌బాబు రావాల‌ని కోరుకుంటున్నారు. ఆయ‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న వ‌ర‌ద బాధితుల‌కు న్యాయం చేస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది.