Chandrababu Naidu: చంద్ర‌బాబు `డేరింగ్` స్టెప్

క‌ర్నూలు కేంద్రంగా జ‌రిగిన ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే చంద్ర‌బాబునాయుడు ఈసారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళుతున్నార‌ని అర్థం అవుతోంది.

  • Written By:
  • Updated On - May 21, 2022 / 01:17 PM IST

క‌ర్నూలు కేంద్రంగా జ‌రిగిన ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఈసారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళుతున్నార‌ని అర్థం అవుతోంది. అక్క‌డి సీనియ‌ర్ లీడ‌ర్ , మాజీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి, మాజీ ఎమ్మెల్సీ ప్ర‌భాక‌ర్ ను కాద‌ని డేర్ స్టెప్ వేశారు. ఆ జిల్లా టీడీపీలో ఇదో సంచ‌ల‌న నిర్ణ‌యం. అంతేకాదు, చంద్ర‌బాబులో క‌న్పిస్తోన్న మార్పుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా కూడా తీసుకోవ‌చ్చు. సుదీర్ఘంగా పార్టీలో ఉంటూ రాజ‌కీయాల‌ను న‌డిపిన కేఈ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్ట‌డం బాబు తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యం. దాని ప‌ర్య‌వ‌సాలు ఎలా ఉంటాయ‌న్న నాన్చుడి ధోర‌ణి లేకుండా డోన్ లో జ‌రిగిన `బాదుడే బాదుడు` కార్య‌క్ర‌మంలో సుబ్బారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం టీడీపీ సంస్థాగ‌త మార్పుల‌కు నాందిగా నిలుస్తోంది.

క‌ర్నూలు జిల్లా టీడీపీకి తొలి నుంచి అండ‌గా కేఈ కుటుంబం ఉండేది. వాళ్ల‌ను కాద‌ని డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రొక‌రు ముందుకు కూడా రాలేని ప‌రిస్థితి. కొన్ని ద‌శాబ్దాలు టీడీపీ త‌ర‌పున రాజ‌కీయం చేస్తోన్న కేఈ కృష్ణ‌మూర్తి వివాద‌ర‌హితుడు. ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వ‌చ్చారు. అందుకే, టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడల్లా మంత్రి ప‌దవిని కేఈ అనుభ‌వించారు. అంతేకాదు, ఆయ‌న బ్ర‌ద‌ర్ ప్ర‌భాక‌ర్ కు ఎమ్మెల్యే అవ‌కాశాన్ని టీడీపీ ఇచ్చింది. ఆయ‌న కుటుంబం మొత్తం టీడీపీ అండ‌తోనే ఎదిగింది. కానీ, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీకి దాదాపుగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అధిష్టానం ఇచ్చే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి కూడా ముందుకు రాని ప‌రిస్థితి. అందుకే, నిర్థాక్ష్య‌ణ్యంగా ఆ కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేశారు.

తెలుగుదేశం పార్టీ విర్భావం నుంచి క‌ర్నూలు జిల్లాలో కేఈ సోదరులు, భూమా నాగిరెడ్డి పార్టీకి అండగా ఉండేవారు. భూమా నాగిరెడ్డి టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరిన తర్వాత కేఈ సోదరులు పెద్ద దిక్కయ్యారు. టీడీపీ పాలనలో ఐదేళ్లు రెవెన్యూ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయ‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్ కు టీడీపీ అవ‌కాశం ఇచ్చింది. కానీ, తాజాగా చంద్ర‌బాబునాయుడు తీసుకున్న మూడు రాజ‌ధానుల అంశం వాళ్ల‌కు న‌చ్చ‌లేదు. న్యాయ రాజ‌ధాని క‌ర్నూలు ఉండాల‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌తిపాద‌న వైపు మొగ్గు చూపారు. అంతేకాదు, చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కేఈ ప్ర‌భాక‌ర్ ఇటీవ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. కానీ, ఆ రాజీనామాను చంద్ర‌బాబు ఆమోదించ‌లేదు. మాజీ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి పార్టీలోనే ఉంటూ కుమారుడు శ్యామ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. ఆ క్ర‌మంలో టీడీపీకి గుడ్ బై చెబుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకేనేమో, ముందుగానే చంద్ర‌బాబు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. వాళ్ల స్థానంలో బ‌లంగా ఉన్న సుబ్బారెడ్డికి డోన్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భూమా కుటుంబం ప్రాతినిధ్యం వ‌హించేది. తొలి నుంచి టీడీపీకి అండ‌గా ఉండే ఆ కుటుంబం ఇటీవ‌ల దూరంగా ఉంటుంది. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నుంచి భూమా అఖిల‌ప్రియ‌ను పార్టీలోకి తీసుకుని మంత్రిని చేశారు. ఆ కుటుంబాన్ని రాజ‌కీయంగా మ‌రోసారి బ‌తికించారు. కానీ, ఇప్పుడు అఖిల‌ప్రియ టీడీపీకి దూరంగా ఉంటుంది. అంతేకాదు, టీడీపీ కూడా ఆమె నాయ‌క‌త్వం మీద న‌మ్మ‌కం కోల్పోయింది. ప్రత్యామ్నాయ చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డానికి సిద్ధం అవుతోంది. డోన్ ను సెట్ చేసిన చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌ నాయ‌కత్వాల‌ను కూడా మార్చేసే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద చంద్ర‌బాబు దూకుడుగా వెళుతున్నారని క‌ర్నూలు వేదిక‌గా జ‌రిగిన ప‌రిణామం స్ప‌ష్టం చేస్తోంది.